డాలస్(టెక్సాస్): పైనేమో 90 డిగ్రీల ఫారెన్హీట్ ఎండ.. పైగా చేసేది యోగా.. అయినాసరే అందరి మనసుల్లో చల్లటి భావనలు. ఎవరిపేరు పలికితే శాంతి మంత్రం జపించినట్లవుతుందో అలాంటి మహాత్మా గాంధీ పేరిట అమెరికా గడ్డపై ఒక్కటయ్యారు వారంతా. అందుకే ప్రశాంతంగా, నిశ్చయంగా కొనసాగిందా సాధన. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ (ఎంజీఎంఎన్ టీ) ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్రం డాలస్ లోని ఇర్వింగ్ పట్టణంలో నిర్వహించిన యోగా సాధనలో దాదాపు 500 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్) సహకారంతో ఇర్వింగ్ సిటీలోని థామస్ జెఫర్సన్ పార్క్ లో గల మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద జూన్ 19న ఈ కార్యక్రమం జరిగింది.
ఎంజీఎంఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ షబ్నం మోద్గిల్ ఆహ్వానం మేరకు కార్యక్రమాన్ని ఉద్దేశంచి ప్రసంగించిన ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కలవల.. డాలస్ లోని మహాత్ముడి స్మారక స్థలి వద్ద యోగా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని, యోగా డేను ప్రపంచ వ్యాపంగా 350 మిలియన్ల మంది జరుపుకొంటుండగా, అమెరికాలో 35 మిలియన్ల మంది యోగా సాధన చేస్తున్నారని తెలిపారు. అన్నీ తానై యోగా డే వేడుకలను నిర్వహించారంటూ ఎంజీఎంఎన్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూరను అభినందించారు. అమెరికాలోని అన్ని మహాత్ముడి స్మారకాల్లోకీ డాలస్ లోని స్మారక స్థలే పెద్దదిగా అవతరించిందని, ఇండియన్ అమెరికన్ల మధ్య సంబంధాల బలోపేతానికి కూడా ఈ స్థలమే కేంద్ర బిందువుగా మారిదని అన్నారు.
ఎంజీఎంఎన్టీ డైరెక్టర్ తాయబ్ కుందావాలా ఆహ్వానం మేరకు కౌన్సిల్ జనరల్ ఆఫ్ హ్యూస్టన్ (టెక్సాస్) డాక్టర్ అనుపమా రాయ్, కౌన్సిల్ రిప్రెసెంటేటివ్ ఆర్.డి. జోషి లు ప్రసంగించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృంద సభ్యులు శ్రీధర్ తుల్జారామ్, డాక్టర్ నిక్ ష్రాఫ్, సపానంద్ లు ఆహుతులకు యోగాభ్యాసం, ప్రాణాయాయం, ధ్యానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు నిర్వహించిన 200 కార్యక్రమాలకు తన సహకారాన్ని అందించిన ఎంజీఎంఎన్టీ బోర్డ్ మెంబర్, కమ్యూనిటీ వాలంటీర్ నగేశ్ దిండికుర్తి సేవలను నిర్వాహకులు గుర్తుచేసుకున్నారు. ఎంజీఎంఎన్టీ కో చైర్ పర్సన్ ఇందు మందాడి ముగింపు ప్రసంగం చేస్తూ ఇర్వింగ్, డాలస్ ల ప్రజానికానికి, ఎలక్టానిక్ మీడియా, సూరజ్ ఆర్ట్స్, ఇషా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్డోబర్ 2 నిర్వహించనున్న శాంతియాత్ర(పీస్ వాక్) లో పాల్గొనవలసిందిగా ఆహుతులను కోరారు.
డాలస్ ఎంజీఎంఎన్టీ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు
Published Tue, Jun 21 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement
Advertisement