కాన్‌బెర్రా : మలేషియా ఎంహెచ్ 370 విమానం అదృశ్యం అతి పెద్ద మిస్టరీ అని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. ఎంహెచ్370 అదృశ్యంపై దాదాపు మూడున్నర ఏళ్లుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట సేఫ్టీ బ్యూరో (ఏటీఎస్‌బీ) బృందం.. దీనిపై మంగళవారం తుది నివేదకను ప్రభుత్వానికి సమర్పించింది. ఎంహెచ్ 370 ప్రయాణికులు బాధిత కుటుంబాలకు మేం న్యాయం చేయలేకపోయాం.. మమ్మల్ని క్షమించండంటూ.. రీసెర్చ్ ఏటీఎస్‌బీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఆధునిక ప్రపంచంలో ఈ విమాన అదృశ్యం ఎవరూ ఊహించలేనిది అని ఏటీఎస్‌బీ తెలిపింది. బీజింగ్ నుంచి కౌలాలంపూర్‌కు 2014 మార్చి 8న బయలుదేరిన ఎంహెచ్370 విమానం కొన్నిగంటల్లోనే దిశ మార్చుకుని అదృశ్యమైన విషయం తెలిసిందే.
ఎంహెచ్370 అదృశ్యం అనేది విమానయాన చరిత్రలోనే అతి పెద్ద విషాదమని ఏటీఎస్‌బీ చీఫ్ కమిషనర్ గ్రెగ్ హూడ్ చెప్పారు. ఈ విమానం కోసం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ ప్రపంచంలోనే అతి పెద్దది.. అయినా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం చేయలేకపోయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంహెచ్ 370 అదృశ్యమైన ప్రాంతంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పడమటి ప్రాంతంలోని 2,800 కిలోమీటర్ల పరిధిని అణువణువు శోధించామని.. అలాగే సముద్రగర్భంలో లక్షా 20 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సోనార్ టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు.