
కంట నీరు పెట్టిన పోప్ ఫ్రాన్సిస్
లెస్బోస్(గ్రీస్): ‘మీరు ఒంటరి కాదు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అంటూ గ్రీకులోని లెస్బోస్ ద్వీపంలో చిక్కుకున్న శరణార్థులకు పోప్ ఫ్రాన్సిస్ భరోసా ఇచ్చారు. వలసల సమస్యలు పరిష్కరించడానికి మానవత్వంతో సమిష్టిగా ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అంతర్గత యుద్ధంతో సిరియా నుంచి పారిపోయి ఇక్కడి ఓడ రేవులో తలదాచుకున్న శరణార్థుల స్థావరాన్ని ఎక్యుమెనికల్ పాట్రియార్క్, గ్రీస్ చర్చ్ హెడ్, ఆర్చిబిషప్ ఐరోనిమస్‌తో కలసి శనివారం పోప్ సందర్శించారు.
అక్కడున్నవారి దురవస్థను చూసి చలించిన పోప్ కంట నీరు పెట్టారు. దౌత్య, రాజకీయ మార్గాల ద్వారా ఈ సంక్షోభాన్ని అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుతూ ముగ్గురు మత పెద్దలూ ఓ తీర్మానంపై సంతకం చేశారు. ‘మేము కూడా సముద్రమనే శ్మశానానికి వెళుతున్నాం. తలదాచుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన చాలామంది జాడ లేకుండా పోయారు’ అని లెస్బోస్ బయలుదేరే ముందు పోప్ ఆవేదనగా చెప్పారు.
లెస్బోస్‌లో అడుగుపెట్టిన ఫ్రాన్సిస్‌కు శరణార్థ శిబిరంలోని చిన్నారులు, మహిళలు, వృద్ధులు స్వాగతం పలికారు. చిన్నారులు కొన్ని చిత్రాలు వేసి పోప్‌కు బహూకరించారు. శిబిరంలో ఒకరు ఆశీర్వదించమంటూ కన్నీటితో పోప్ పాదాలపై పడ్డారు. మరికొందరు తమకు విముక్తి కల్పించమంటూ పెద్దగా అరుస్తూ వేడుకున్నారు.
యూరప్‌కు గుణపాఠం...
గ్రీస్ సందర్శించిన పోప్ ఫ్రాన్సిస్ అక్కడి శరణార్థుల శిబిరంలోని 12 మంది సిరియా ముస్లింలను తన చార్టర్ విమానంలో ఇటలీకి తీసుకువచ్చారు. తద్వారా శరణార్థులను ఎలా ఆదరించాలో యూరప్‌కు గుణపాఠం నేర్పారు. ఆరుగురు చిన్నారులు సహా మూడు కుటుంబాలకు చెందిన వీరికి హోలీ సీ మద్దతు తెలిపింది. ఇటలీ కేథలిక్ శాంటెజిదియో సమాజం వారి బాధ్యతలు తీసుకుంది.