
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్న పాంపియో గురువారం భారత్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. భారత విదేశాంగ మంత్రిగా నియమితులైన జయశంకర్‌కు పాంపియో అభినందనలు తెలిపారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ నేత ఒకరు భారతలో పర్యటించడం ఇదే ప్రథమం.
28నుంచి జపాన్‌లో జరిగే జి–20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో పాంపియో భారత పర్యటనకు ప్రాధాన్యం లభించింది. పర్యటనలో భాగంగా పాంపియో విదేశాంగ మంత్రి జయశంకర్, తదితర మంత్రులతో సమావేశమవుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.‘భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పరం లాభదాయకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలకు ఈ పర్యటన చక్కని అవకాశంగా భావిస్తున్నాం.’అని కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment