
ఆ విమానం హైజాక్!
మలేసియా అధికారుల అనుమానం
కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పాండర్‌ను కావాలనే స్విచాఫ్ చేశారని వెల్లడి
పైలట్ ఇంట్లో సోదాలు
కౌలాలంపూర్/న్యూఢిల్లీ: వారం కిందట కనిపించకుండా పోయిన మలేసియా విమానాన్ని హైజాక్ చేసి ఉంటారని ఆ దేశ దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విమానాన్ని దారిమళ్లించే ముందు అందులోని కమ్యూనికేషన్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నిలిపేసి, రేడియో సిగ్నళ్ల ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేశారని భావిస్తున్నారు. విమానం అదృశ్యం తర్వాత శనివారం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ కౌలాలంపూర్‌లో విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు.
రాడార్, ఉపగ్రహాల సమాచారాన్ని పరిశీలించాక బోయింగ్ మలేసియా తూర్పు తీరానికి చేరకముందు దాని సాంకేతిక వ్యవస్థను విమానంలోని ఎవరో ఉద్దేశపూర్వకంగా నిలిపేసి, దారి మళ్లించినట్లు స్పష్టమవుతోందని అన్నారు. రజాక్‌హైజాక్ మాట వాడకున్నా ఆయన మీడియాతో మాట్లాడిన వెంటనే పోలీసులు కౌలాలంపూర్‌లోని ఈ విమాన పైలట్ జహరీ అహ్మద్‌షా(53) ఇంట్లో సోదాలు జరిపి, విమానం నేవిగేషన్‌కు సంబంధించిన పరికరాన్ని స్వాధీనం చేసుకోవడం హైజాక్ అనుమానాలకు బల మిస్తోంది. మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ ఐదుగురు భారతీయులు సహా 239 మంది తో కౌలాంపూర్ నుంచి ఈ నెల 8న బీజింగ్ వెళ్తూ బయల్దేరిన గంట తర్వాత కనిపించకుండా పోవడం తెలిసిందే. రజాక్ మీడియాతో ఏమన్నారంటే...
- విమానం మలేసియా, వియత్నాంల ఎయిర్ ట్రాఫిక్ కంటోల్ ్రసరిహద్దులో ఉన్నప్పుడు అందులోని ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేశారు. ఆ తర్వాత విమానం వెనక్కి వెళ్లి, పశ్చిమంగా, వాయవ్య దిశగా వెళ్లింది. ఇవన్నీ అందులోని ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా చేసిన పనులే.
- ఈ నెల 7న అర్ధరాత్రి దాటాక 12.41కి బయల్దేరిన విమానం నుంచి 8న ఉదయం 8.11 గంటలకు శాటిలైట్ చివరి సిగ్నల్ అందింది. అంటే విమానం కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగాక 7 గంటలకు పైగా గాల్లోనే ఉంది. కొత్త విషయాలు తెలుస్తుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులపై మళ్లీ విచారణ జరపాల్సిన అవ సరముంది.
‘బంగాళాఖాతంలో కూలిపోయింది!’:గల్లంతైన విమానం బంగాళాఖాతంలోనో, హిందూ మహాసముద్రంలోనో కూలి ఉండొచ్చని అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ టీవీ చానల్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. అధికారుల విశ్లేషణ అంటూ అవి వెలువరించిన కథనాల ప్రకారం.. ‘విమానం నింగిలో ఉన్నప్పుడు నిర్దేశిత ఎత్తు, తగ్గులకు దాటి ప్రయాణించింది.
మలేసియా మిలటరీ రాడార్ సమాచారం ప్రకారం.. విమానం కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాక 45 వేల అడుగుల ఎత్తుకు (నిర్దేశిత ఎత్తును దాటి) వెళ్లింది. తర్వాత అడ్డదిడ్డంగా 23 వేల అడుగుల ఎత్తుకు దిగి పెనాంగ్ ద్వీపం దిశగా వెళ్లింది. తర్వాత వాయవ్యదిశగా వెళ్లి మళ్లీ ఎత్తుకు చేరి మలకా జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు పయనించింది. నిమిషం వ్యవధిలోనే 40 వేల అడుగులు కిందకి దిగింది. ఇదంతా ఇది మానవ ప్రమేయం లేకుండా సాధ్యం కాదు.విమానంలోని ఎవరో ఒకరు ఏదో కారణంతో, బహుశా ఉగ్రవాద చర్యలో భాగంగా ఈ పని చేసి ఉండొచ్చు.’