
చూడు.. నువ్వు మాత్రమే చూడు..
బస్సులో లేదా రైల్లో వెళ్తున్నారు.. రద్దీగా ఉంది.. చాలా ముఖ్యమైన మెయిల్ లేదా మెసేజ్ చెక్ చేసుకోవాలి.. మీరు నెట్ ఓపెన్ చేయగానే.. పక్కనున్నవాళ్లు, నిల్చున్నవాళ్లు లుక్కేయడం మొదలుపెట్టారు.. ఇలాంటి సన్నివేశాలు మనం అడపాదడపా చూస్తునే ఉంటాం.. టర్కీలోని బిస్మిల్‌కు చెందిన సెలాల్ గోగర్ మాత్రం చూస్తూ ఊరుకోలేదు. తనక్కూడా ఎదురైన ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు. మొబైల్ స్క్రీన్‌పై కనిపించే మెసేజ్‌లు, మెయిళ్లు మనకు మాత్రమే కనిపించేలా చేశాడు. దీని కోసం ప్రత్యేకమైన కళ్లద్దాలను తయారుచేశాడు. మొబైల్ రిపేర్ వ్యాపారంలో ఉన్న సెలాల్ మొబైల్ తో అనుసంధానమై ఉండే కళ్లద్దాలను రూపొందించాడు.
మొబైల్‌లో ఓ ప్రత్యేకమైన చిప్, అద్దాలలో ఓ చిప్ బిగించాడు. దీని వల్ల మిగతావాళ్లు మన ఫోన్ చూసినా.. వారికక్కడ ఇలా అంతా తెల్లగా కనిపిస్తుంది. కళ్లద్దాలు వేసుకున్న మనకు మాత్రమే మొబైల్ స్క్రీన్‌పై ఉన్నది కనిపిస్తుంది. ఈ టెక్నాలజీని ఆన్‌ఆఫ్ చేయడానికి బ్లూటూత్‌ను వినియోగించాడు. అంటే.. బ్లూటూత్ ద్వారా బటన్ ఆన్ కాగానే.. స్క్రీన్ తెల్లగా అయిపోతుంది. కళ్లద్దాలు పెట్టుకున్న మనకు మాత్రమే వివరాలు కనిపిస్తాయి. ఆఫ్ చేయగానే.. మళ్లీ స్క్రీన్ మీద వివరాలు మామూలుగా అందరికీ కనిపిస్తాయి. అంతేకాదు.. ఈ టెక్నాలజీని బ్లూటూత్‌తో కలిపి కేవలం రూ.700 లోపే అమ్మాలని సెలాల్ యోచిస్తున్నాడు. పేటెంట్ తీసుకునే విషయంలో బిజీగా ఉన్న అతడు త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తేనున్నాడు.