21వ శతాబ్దపు 'కేవ్ మ్యాన్'..! | Modern-Day Caveman Has Been Living in a Mountain Cave for the Last 40 Years | Sakshi
Sakshi News home page

21వ శతాబ్దపు 'కేవ్ మ్యాన్'..!

Published Wed, Aug 3 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

21వ శతాబ్దపు  'కేవ్ మ్యాన్'..!

21వ శతాబ్దపు 'కేవ్ మ్యాన్'..!

అర్జెంటీనాః టుకుమాన్ ప్రావిన్స్ ఎత్తైన గ్రొట్టో పర్వతప్రాంతంలో ఓ వ్యక్తి 40 ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నాడు. మనిషి సంచారం ఉండని ఆ ప్రాంతంలోని గుహలో ఒంటరిగా ఉంటున్న అతడ్ని... ఇప్పుడంతా '21 సెంచరీ కేవ్ మ్యాన్' అని పిలుస్తున్నారు.

పర్వతప్రాంతంలో ఏకాంతంగా గడుపుతున్న 79 ఏళ్ళ పెడ్రో ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా కనిపిస్తాడు. తనకు ప్రకృతి వనాలమధ్య ఒంటరిగా నివసించడం ఎంతో ఇష్టమని చెప్తున్నాడు. తాను ప్రస్తుతం నివసిస్తున్న గుహకు మూడు గంటలు నడిచి వెళ్ళే దూరంలో ఉన్న చిన్న పట్టణం  శాన్ పెడ్రో డి కొలాలో లో పుట్టి పెరిగిన  పెడ్రో... బొలీవియా బొగ్గు రావాణా కోసం 14 ఏళ్ళ వయసులోనే ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అక్కడినుంచీ 40 ఏళ్ళ క్రితమే తిరిగి వచ్చేసిన అతడు.. ప్రకృతి మధ్య జీవించాలనే తన చిన్ననాటి కల సాకారం చేసుకోవడంలో భాగంగా గ్రోట్టో పర్వత ప్రాంతంలోని గుహలో శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు. నాగరిక సమాజంలో బతికిన రోజులను గుర్తు చేసుకుంటూ... మద్యం, హింస మనిషిని నాశనం చేస్తాయని చెప్తున్నాడు. అందుకే తాను అడవిని ఇష్టపడతానని, అక్కడ నివసించే జంతువులే తన కుటుంబ సభ్యులని అంటున్నాడు. పర్వత ప్రాంతంలో నివసించే సింహాలు, ఇతర మాంసాహారుల బారినుంచీ రక్షణకోరే 11 కోళ్ళు, 2 మేకలకు తన గుహలో రాత్రిపూట ఆశ్రయం కల్పిస్తున్నాడు. అవి పగలంతా పర్వతప్రాంతంలో ఆహారంకోసం సంచరించి తిరిగి రాత్రి సమయంలో పెడ్రో గుహకు చేరుకుంటుంటాయి.

తెల్లవారుజామున కాకుల కూతలు మొదలయ్యే 3 గంటల ప్రాంతంలోనే  పెడ్రో కూడా నిద్రనుంచీ మేల్కొంటాడు. ముందుగా అక్కడ దొరికే కట్టెలతో మంటను రాజేసి, ఆ వెలుగులోనే అక్కడ దొరకే సేంద్రియ అల్పాహారాన్ని భుజిస్తాడు. తెల్లవారిన అనంతరం రైఫిల్ పట్టుకొని పర్వత ప్రాంతంలో వేటకు వెళ్ళడమో.. లేదంటే అక్కడకు మూడు గంటలు నడిచి వెళ్ళే దూరంలో ఉన్న చిన్న పర్యటక పట్టణం శాన్ పెడ్రో డి కొలాలో వెళ్ళడమో చేస్తుంటాడు. గుహనుంచీ పట్టణానికి వచ్చిన అతడ్ని అక్కడి ప్రజలే కాక పర్యటకులూ సాదరంగా ఆహ్వానిస్తారని,  ఎవ్వరికీ హాని తలపెట్టని మంచి మనిషిగా  పెడ్రోను గుర్తిస్తారని అతడి మేనల్లుడు జువాన్ కార్లోస్ పేర్కొన్నాడు. తనకు వచ్చే నెలవారీ పెన్షన్ 100 డాలర్లను తీసుకొని అతడు తనకు, తనతో ఉండే జంతుజాలానికీ కావలసిన వస్తువులను పట్టణంనుంచీ కొనుగోలు చేసి, తిరిగి కాలినడకన తన గుహకు తీసుకెడుతుంటాడు. మూడు గంటలపాటు  కాలినడక అంటే కొంత కష్టమైనా.. పెడ్రో దాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తాడు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనిదే మనుగడ లేదని వాదిస్తున్న నేటి తరుణంలో పెడ్రోమాత్రం విద్యుత్, గ్యాస్, టెలిఫోన్ వంటి సౌకర్యాలేమీ లేకుండా జీవిస్తున్నాడు. అయితే పర్వతాల్లో కూడా సిగ్నల్ అందుకునే బ్యాటరీ శక్తి కలిగిన ఓ అరుదైన అలారంతో కూడిన పాత రేడియో మాత్రం అతని వద్ద ఉంటుంది. ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే అతడ్ని సందర్శించేందుకు మాత్రం ఎంతోమంది పర్యటకులు వెడుతుంటారని, మోడ్రన్ కేవ్ మ్యాన్ గా పెడ్రోను పిలుస్తారని పెడ్రో మేనల్లుడు ఒకరు చెప్తున్నారు.  అంతేకాక పాఠశాల విద్యార్థులు సైతం అతడ్ని చూసేందుకు, గుహకు ప్రత్యేక ట్రిప్ లు ఏర్పాటు చేసుకుంటారని తెలిపాడు. అయితే తనకు ప్రపంచం మొత్తం కాలి నడకన తిరగాలన్న కోరిక ఉందనీ, కానీ మధ్యలో ఎంతో సముద్రం ఉందని, సమయం వస్తే అదికూడా దాటే ప్రయత్నం చేస్తానని.. పెడ్రో 79 ఏళ్ళ వయసులోనూ యువకుడిలా తన ఆసక్తిని వ్యక్తబరుస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement