భారత్‌ శక్తి మాకు తెలుసు | Modi tour in Portugal | Sakshi
Sakshi News home page

భారత్‌ శక్తి మాకు తెలుసు

Published Sun, Jun 25 2017 2:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

భారత్‌ శక్తి మాకు తెలుసు

భారత్‌ శక్తి మాకు తెలుసు

అలాంటి దేశంతో సంబంధాలు చాలా ముఖ్యం
- మోదీ పర్యటన నేపథ్యంలో వెల్లడించిన అమెరికా
ప్రపంచంలో ‘మంచికోసం నడిచే శక్తి’ భారత్‌ అని ప్రశంస
- ‘హెచ్‌1బీ’ని భారత్‌ లేవనెత్తితే స్పందిస్తామన్న అధికారులు
- పోర్చుగల్‌లో మోదీ పర్యటన.. అక్కడి నుంచి అమెరికాకు పయనం
 
వాషింగ్టన్‌: ప్రపంచంలో ‘మంచికోసం నడిచే శక్తి’ భారతదేశమని.. అలాంటి దేశంతో సత్సంబంధాలు చాలా ముఖ్యమని అమెరికా స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అమెరికా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ట్రంప్‌ సర్కారు భారత్‌ను విస్మరిస్తోందని.. మోదీ ప్రభుత్వంపై పెద్దగా దృష్టిపెట్టడం లేదని వస్తున్న వార్తలు అవాస్తవం. భారత్‌ అంటే అమెరికాకు ప్రత్యేకమైన అభిమానం. సోమవారం నాటి మోదీ–ట్రంప్‌ సమావేశంలో ఇది కనిపిస్తుంది’ అని శ్వేతసౌధ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక చైనాకు మద్దతుగా మాట్లాడుతున్న తరుణంలో భారత్‌తో సంబంధాలు దెబ్బతింటున్నాయంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు. ట్రంప్‌–మోదీ మధ్య పలుమార్లు హాట్‌లైన్‌ సంభాషణ జరిగిందని.. ఇరుదేశాలతోనూ సత్సంబంధాలకోసమే ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

అటు శ్వేతసౌధ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ కూడా సోమవారం జరగనున్న మోదీ–ట్రంప్‌ సమావేశంలో కీలకాంశాలపై కూలంకషంగా చర్చ జరగనుందని వెల్ల డించారు. ‘ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సహకారం, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు, రక్షణ రంగంలో భాగస్వామ్యం, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంతోపాటు అంతర్జాతీయంగా సహకారం, వాణిజ్యంలో భారాన్ని పంచుకోవటం, చట్టాల అమలు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చిస్తారు’ అని స్పైసర్‌ వెల్లడించారు.  కాగా, ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక శ్వేతసౌధం విందు స్వీకరించనున్న తొలి విదేశీ నాయకుడు మోదీయే కావటం విశేషం. అందుకే అమెరికాకు భారత్‌ ప్రత్యేకమని స్పైసర్‌ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యాక తమ, తమ బృందాలతో మరోసారి భేటీ అవుతారు. సంయుక్త మీడియా సమావేశం తర్వాత భోజన కార్యక్రమంలో వీరంతా పాల్గొననున్నారు.
 
హెచ్‌1బీపై చర్చకు సిద్ధం: అమెరికా
ప్రధాని మోదీ,  ట్రంప్‌ మధ్య చర్చల్లో హెచ్‌1బీ వీసాల విషయం చర్చకు వస్తుందనుకోవటంలేదని అమెరికా స్పష్టం చేసింది. ఒకవేళ భారత్‌ ఈ విషయాన్ని లేవనెత్తితే దీనికి స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది.
 
పోర్చుగల్‌తో 11 ఒప్పందాలు 
లిస్బన్‌: మూడుదేశాల పర్యటనకోసం ఢిల్లీనుంచి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పోర్చుగల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియో కోస్టాతో అంతరిక్షం, పర్యావరణంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై మోదీ విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలు జరిపేందుకు 4మిలియన్‌ యూరోల (దాదాపు రూ.28.8 కోట్లు)తో సంయుక్త నిధిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ‘పోర్చుగీసు ఆర్థిక ఎదుగుదల, భారత వృద్ధి కలిస్తే ఇరుదేశాలకు మరిన్ని అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయ’ని మోదీ తెలిపారు. ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని ఆంటోనియో వెల్లడించారు. పోర్చుగల్‌ పర్యటనను ముగించుకున్న ప్రధాని శనివారం రాత్రి అమెరికాకు పయనమయ్యారు. 

Advertisement
Advertisement