కోతికి సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదన్న కోర్టు | Monkey selfie case: judge rules animal cannot own his photo copyright | Sakshi
Sakshi News home page

కోతికి సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదన్న కోర్టు

Published Thu, Jan 7 2016 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

కోతికి సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదన్న కోర్టు

కోతికి సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదన్న కోర్టు

శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియాతోపాటు ప్రింట్ మీడియాలోను సంచలనం సృష్టించిన ‘మకాకు మంకీ’ సెల్ఫీ ఫొటోకు ఎవరికీ కాఫీరైట్ హక్కులు ఇవ్వలేమని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు బుధవారం తేల్చింది. నరుతో అని పిలిచే ఈ ఆరేళ్ల కోతి ఫొటోను ఇండోనేషియాలోని సులవేసిలో 2011లో బ్రిటన్‌కు చెందిన నేచర్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటరా కెమెరాతో తీసినది.
 
సులవేసిని డేవిడ్ సందర్శించినప్పుడు ఆయనకు ఈ మకాకు మంకీ కనిపించింది. దాన్ని దగ్గరి నుంచి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన ప్పుడు ఆ కోతి ఆయన కెమేరాను లాక్కొంది. అది తనకు తెలియకుండానే సెల్ఫీ తీసుకుంది. ఆ ఫొటోను ఓ వైల్డ్‌లైఫ్ మాగజైన్‌లో ప్రచురించినప్పుడు కోతి స్వయంగా తీసుకున్న సెల్ఫీ అని తెలిపారు. ఈ విషయం తెల్సిన ‘పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా)’ సంస్థ ఆ ఫొటోపై కాపీరైట్ హక్కులు ఆ కోతికే ఇవ్వాలంటూ శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ కోతి ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఓ జంతువు తీసుకున్న సెల్ఫీ అంటూ ఆ ఫొటో మీడియాలో విస్తృతంగా పాపులర్ అయింది.

పెటా దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటరా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆ ఫొటోపై హక్కులు తాను పనిచేస్తున్న సంస్థ ‘వైల్డ్‌లైఫ్ పర్సనాలిటీస్ లిమిటెడ్’ కంపెనీకే ఉన్నాయంటూ వాదించారు. వాదోపవాదాల అనంతరం బుధవారం కోర్టు తీర్పును వెలువరించింది. అమెరికా చట్టాల ప్రకారం మానవులు సృష్టించిన వాటికే కాపీరైట్ హక్కులు ఉంటాయని, జంతువులకు ఉండవని జడ్జీ తేల్చారు. ఏడాది క్రితం వరకు మానవ సృష్టియా లేదా జంతువుల సృష్టియా అన్న వివరణ కాపీరైట్ చట్టంలో లేదు. గతేడాదే ఈ చట్టాన్ని సవరించి మానవ సృష్టికి మాత్రమే కాపీరైట్ హక్కులు వర్తిస్తాయనే నిబంధన తీసుకొచ్చారు.

Advertisement
Advertisement