macaque monkey
-
కోతికి సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదన్న కోర్టు
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియాతోపాటు ప్రింట్ మీడియాలోను సంచలనం సృష్టించిన ‘మకాకు మంకీ’ సెల్ఫీ ఫొటోకు ఎవరికీ కాఫీరైట్ హక్కులు ఇవ్వలేమని అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కోర్టు బుధవారం తేల్చింది. నరుతో అని పిలిచే ఈ ఆరేళ్ల కోతి ఫొటోను ఇండోనేషియాలోని సులవేసిలో 2011లో బ్రిటన్‌కు చెందిన నేచర్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటరా కెమెరాతో తీసినది. సులవేసిని డేవిడ్ సందర్శించినప్పుడు ఆయనకు ఈ మకాకు మంకీ కనిపించింది. దాన్ని దగ్గరి నుంచి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన ప్పుడు ఆ కోతి ఆయన కెమేరాను లాక్కొంది. అది తనకు తెలియకుండానే సెల్ఫీ తీసుకుంది. ఆ ఫొటోను ఓ వైల్డ్‌లైఫ్ మాగజైన్లో ప్రచురించినప్పుడు కోతి స్వయంగా తీసుకున్న సెల్ఫీ అని తెలిపారు. ఈ విషయం తెల్సిన ‘పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా)’ సంస్థ ఆ ఫొటోపై కాపీరైట్ హక్కులు ఆ కోతికే ఇవ్వాలంటూ శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ కోతి ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఓ జంతువు తీసుకున్న సెల్ఫీ అంటూ ఆ ఫొటో మీడియాలో విస్తృతంగా పాపులర్ అయింది. పెటా దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటరా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆ ఫొటోపై హక్కులు తాను పనిచేస్తున్న సంస్థ ‘వైల్డ్‌లైఫ్ పర్సనాలిటీస్ లిమిటెడ్’ కంపెనీకే ఉన్నాయంటూ వాదించారు. వాదోపవాదాల అనంతరం బుధవారం కోర్టు తీర్పును వెలువరించింది. అమెరికా చట్టాల ప్రకారం మానవులు సృష్టించిన వాటికే కాపీరైట్ హక్కులు ఉంటాయని, జంతువులకు ఉండవని జడ్జీ తేల్చారు. ఏడాది క్రితం వరకు మానవ సృష్టియా లేదా జంతువుల సృష్టియా అన్న వివరణ కాపీరైట్ చట్టంలో లేదు. గతేడాదే ఈ చట్టాన్ని సవరించి మానవ సృష్టికి మాత్రమే కాపీరైట్ హక్కులు వర్తిస్తాయనే నిబంధన తీసుకొచ్చారు. -
ఈ కోతికి కాపీరైట్ లేదట!
పళ్లికిలిస్తూ.. ఇలా తనను తానే అందంగా ఫొటో తీసుకున్న ఈ మకాక్ కోతికి తాను తీసుకున్న ఈ సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదట! అమెరికాలోని కాపీరైట్ కార్యాలయం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కోతి సెల్ఫీ వల్ల వికీపీడియా వెబ్సైట్, బ్రిటన్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ జే స్లాటర్ల మధ్య కాపీరైట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం.. ఇండోనేసియాలోని సులావెసీ దీవిలో కోతుల గుంపును ఫొటోలు తీస్తుండగా ఈ కోతి డేవిడ్ కెమెరా లాక్కుపోయి వందలాది ఫొటోలు క్లిక్‌మనిపించింది. తర్వాత చూస్తే.. అందమైన ఈ సెల్ఫీతోపాటు మరికొన్ని ఫొటోలు వచ్చాయి. దీంతో ఈ కోతి వార్తల్లో సందడి చేసింది. దీనిని తొలి ‘మంకీ ఫొటోగ్రాఫర్’గా గుర్తిస్తూ వికీపీడియా తమ వెబ్సైట్లో పెట్టారు. ఈ ఫొటోపై తనకే హక్కులు ఉన్నాయని, ఈ ఫొటోను నా అనుమతి లేకుండా అందరికీ ఉచితంగా ఎలా అందుబాటులో ఉంచుతారంటూ డేవిడ్ మండిపడుతున్నాడు. ఈ వెబ్‌సైట్‌పై కేసువేస్తానని ప్రకటించాడు. కానీ.. ‘కెమెరా నీదే అయినా.. ఫొటో తీసింది కోతే కాబట్టి.. ఫొటోపై కాపీరైట్ కోతికే ఉంటుంద’ని వికీపీడియా వాదించింది. అమెరికా చట్టాల తాజా నిబంధనల ప్రకారం.. కోతి, ఏనుగు లేదా మరే ఇతర జంతువైనా సరే తీసిన ఫొటోలు, వేసిన పెయింటింగులపై వాటికి ఎలాంటి హక్కులూ ఉండవని అమెరికా కాపీరైట్ కార్యాలయం ధ్రువీకరించింది.