సెప్టెంబర్ 4న థెరిసాకు సెయింట్ హోదా
కోల్‌కతా : నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిసాకు సెప్టెంబర్ 4వ తేదీన పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్‌ను అధికారికంగా ప్రదానం చేయనుంది. ఈ మేరకు పోప్ ప్రాన్సిస్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మదర్ థెరిసాలోని అతీత శక్తిని గత ఏడాదే పోప్ గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా ఈ హోదాను ఈ ఏడాది సెప్టెంబర్ నాలుగో తేదీన రోమ్లో థెరిసాకు ఇవ్వనుంది. దీంతో ప్రపంచ శాంతిదూతగా పేరొందిన థెరిస్సా ఇక దైవదూతగా అవతరించనున్నారు.
మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో ఆమె తుదశ్వాస విడిచారు. కాగా మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' స్థాపనకు అనుమతి పొందారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలందించిన విషయం తెలిసిందే.