పుట్టగొడుగులతో సెల్ ఫోన్ బ్యాటరీలు!
ఇకపై పుట్టగొడుగులు సెల్ ఫోన్లో బ్యాటరీలుగా మారనున్నాయా? విద్యుత్ వాహనంలో ఇంధనమై పోనున్నాయా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియా యూనివర్శిటీ రివర్ సైడ్ బోర్న్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధనల్లో వినూత్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్టబెల్లా మష్రూమ్స్ (పుట్టగొడుగులు) ను ఉపయోగించి కాలుష్యకారంకం కాని, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణానికి ఎలాంటి హాని కలగని లిథియమ్ అయాన్ బ్యాటరీ యానోడ్ ను ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు.
ప్రస్తుత పరిశ్రమల్లో రీఛార్జబుల్ లిథియమ్ అయాన్ బ్యాటరీ యానోడ్లను తయారు చేసేందుకు అధిక ఖర్చును పెడుతున్నారు. దీనికి సింథటిక్ గ్రాఫైడ్స్ ను ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా శుద్ధి చేయాల్సిన పరిస్థితిలో వీటి ఉత్సత్తికి అత్యధికంగా ఖర్చవుతోంది. అంతేకాదు వీటిని తయారు చేసే పద్ధతి కూడ పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం బ్యాటరీలను వాడాల్సిన అవసరం పెరగడంతో ఖరీదైన గ్రాఫైట్ ను వాడే స్థానంలో తక్కువ ధరలో దొరికే పుట్ట గొడుగులను వాడొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. పుట్టగొడుగులతో బయోమాస్ రూపంలో గతంలో నిర్వహించిన పరిశోధనల్లో అవి పోరోస్ గా మారినట్లు గుర్తించారు. అదే పోరోసిటీ బ్యాటరీల తయారీకి అవసరమౌతుందని గ్రహించారు. పుట్టగొడుగుల్లో పొటాషియం, ఉప్పు గాఢతలను క్రమేపీ పెంచుతూ రంధ్రాలు పడేలా చేయడంవల్ల ఎలక్టోలైట్ క్రియాశీల పదార్థ సామర్థ్యాన్ని పెంచవచ్చని తెలుసుకున్నారు. ఇలా తయారైన సాంప్రదాయక యానోడ్ లిథియం బ్యాటరీ మెటీరియల్స్ భవిష్యత్తులో అత్యంత ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు పరిశోధకులు.
కాల క్రమంలో కార్బన్ తో తయారు చేసిన బ్యాటరీల కంటే ఇటువంటి సాంప్రదాయక ఇంధనం వాడకం వల్ల సెల్ ఫోన్లలో బ్యాటరీలు సైతం ఎక్కువ సమయం డిశ్చార్జి అవ్వకుండా ఉండే అవకాశం ఉందంటుందని పరిశోధకులు చెప్తున్నారు.