cell phone battery
-
చిన్నారుల చేతిలో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ
-
చిన్నారుల చేతిలో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ
మదనపల్లె టౌన్ : చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో శుక్రవారం పాడైపోయిన ఓ సెల్‌ఫోన్‌లోని బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కురబలకోట బీసీ కాలనీకి చెందిన ఇస్మాయిల్, అయేషా దంపతుల కుమారులు షేక్ సయ్యద్ (10), మౌలాలి (8) స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు, మూడు తరగతులు చదువుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటివద్దనే ఉన్న ఈ పిల్లలు శుక్రవారం ఇంటికి సమీపంలో దొరికిన పాత సెల్ఫోన్లో ఉన్న బ్యాటరీ బయటకు తీసి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బాగా ఉబ్బిపోయి ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో అన్నదమ్ములు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే 108లో చిన్నారులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మౌలాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నెట్టికంటయ్య తెలిపారు. -
పేలిన మొబైల్ బ్యాటరీ
కోల్‌సిటీ(రామగుండం): సెలవుల్లో ఇంటి దగ్గర సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు విద్యార్థులు పాతమొబైల్‌బ్యాటరీ పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. చెత్తకుప్పలో దొరికి మొబైల్‌పాత బ్యాటరీతో ఆడుకుంటుండగా... అకస్మాత్తుగా బ్యాటరీ పేలింది. ఇద్దరివీ రెండు చేతివేళ్లు తెగిపోగా, కంటి చూపు ప్రమాదంగా మారింది. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గోదావరిఖనిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత పిల్లల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన గుంటి వేణు రమేష్‌నగర్‌లోని మైనార్టీ గురుకుంలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఎదిరింట్లో ఉంటున్న గూడెల్లి అఖిల్ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వతరగతి చదువుతున్నాడు. సెలవులివ్వడంతో వేణు బుధవారం ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం వేణు,అఖిల్ కలిసి ఇంటిసమీపంలో ఆడుకుంటుండగా, చెత్తకుప్పలో పాతస్మార్ట్‌ఫోన్ బ్యాటరీతోపాటు రెండు వైర్లతో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ వస్తువు దొరికింది. ఎలక్ట్రానిక్ వస్తువుకు ఉన్న రెండు వైర్లను పాతబ్యాటరీకి అనుసంధానం చేశారు. దీంతో ఒక్కసారిగా బ్యాటరీ పేలింది. పేలిన శబ్దంకు సమీపంలోనే ఉన్న పిల్లల కుటుంబ సభ్యులు హుటాహుటిన వెళ్లి చూడగా, అప్పటికే ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు అయ్యాయి. అఖిల్‌కు ఎడమ కంటికి తీవ్రమైన గాయం కావడంతోపాటు ఎడమ చెయ్యి రెండు వేళ్లుకు కూడా గాయాలయ్యాయి. వేణుకు ఎడమ చేయి బొటన వేలు, కుడి చేయి చూపుడు వేలు నుజ్జునుజ్జు అయి తెగిపోయాయి. కడుపులు, ముఖంపై స్వల్పగాయాలయ్యాయి. తొలత గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా ప్రధమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి 108 అంబులెన్స్‌లో ఇద్దరు పిల్లలను తలరించారు. కాగా ఈ ప్రమాదంతో కాలనీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. -
సెల్‌ఫోన్ బ్యాటరీని రాయితో కొట్టగా.. విషాదం
రాయగడ : జిల్లాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తొలొజొరి గ్రామ పంచాయతీలోని మొంకొడొ గ్రామంలో పారవేసిన బ్యాటరీ పేలి ఒక బాలుడి తల, చేయి, తొడలకు తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మొంకొడొ గ్రామానికి చెందిన కునమజ్జి కుమారుడు సునాసింగ్ (8) గ్రామంలో ఆరుబయట ఆడుకుంటూ పనిచేయని సెల్‌ఫోన్ బ్యాటరీని కాలితో తన్నుకుంటూ వెళ్లి ఒక ప్రాంతంలో ఆ బ్యాటరీని రాయితో కొట్టగా హఠాత్తుగా ఆ బ్యాటరీ పేలడంతో గాయాలపాలయ్యాడు. గాయాల పాలైన బాలుడికి తొలుత కాశీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్సి చేసి అనంతరం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పేలుతున్నాయ్.. జాగ్రత్త
నేడు సెల్‌ఫోన్ నిత్యావసరవస్తువుగా మారిపోయింది. అది లేని జీవితాన్ని ఊహించుకోలేం. నిద్రించే సమయంలోనూ పక్కనే పెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యుల కంటే కూడా ఫోన్‌నే ఇష్టంగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అవి పేలి ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మదనపల్లె సిటీ:సెల్ఫోన్లో లిథియం అయాన్/లిథియం పాలిమర్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి విద్యుత్‌తో చార్జ్ అవుతుంటాయి. ఫోన్లో షార్ట్ సర్క్యూట్ జరిగినా.. బ్యాటరీలో లోపమున్నా.. సామర్థ్యానికి మించి ఎక్కువ చార్జింగ్ చేసినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. సెల్‌పోన్ లోపల సున్నితమైన భాగాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సన్నని సర్క్యూట్లు ఉంటాయి. వాటిపై సన్నని ప్లాస్టిక్ తొడుగు ఉంటూ షార్ట్ సర్క్యూట్ కాకుండా కాపాడుతుంటుంది. ఫోన్‌ను అపరిమితంగా వాడినా, ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టినా వేడెక్కి ప్లాస్టిక్ తొడుగు కరిగిపోతుంది. అప్పుడు సర్క్యూట్లు ఏదో ఓ సందర్భంలో కలిసిపోయి షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్ మండిపోయే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్లు చార్జింగ్ పెట్టి అలాగే నిద్రిస్తుంటారు. దీని వల్ల ఎక్కువ సేపు చార్జింగ్ అయి బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు ఏదో ఒక రోజు పేలిపోయే ప్రమాదం ఉంది. సెల్ ఫోన్ చార్జింగ్‌లో ఉండగా కాల్ వస్తే అలాగే మాట్లాడడం కూడా పేలడానికి మరో కారణం. సెల్, బ్యాటరీల వాడకంలో జాగ్రత్తలు ♦ బ్యాటరీలో ఉండే ప్లస్, మైనస్‌లను ఒకదానికొకటి కలపరాదు. ♦ పని చేయని బ్యాటరీలను మంటల్లో వేయరాదు. వేస్తే పేలుడు సంభవిస్తుంది. ♦ బ్యాటరీలను రాళ్లతో గాని, ఇనుపు వస్తువులతో గాని చితక్కొట్టరాదు. ♦ బ్యాటరీలను విప్పి వాటి లోపలి భాగాలను విడదీసే ప్రయత్నం చేయరాదు. ♦ బ్యాటరీలను మంటల వద్ద, గ్యాస్ స్టవ్‌ల వద్ద, వేడి హీటర్ల వద్ద ఉంచరాదు. సెల్ బ్యాటరీ ఆదా ఇలా ♦ 4జీ నెట్ వాడేటప్పుడు బ్యాటరీ వేగంగా ఖర్చు అవుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగించాలి. బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే అనవసరమైన అప్లికేషన్లను డిలీట్ చేస్తే బ్యాటరీ ఆదా చేయవచ్చు. సెల్ ఎక్కువగా ఉపయోగించే వారైతే పవర్ బ్యాంక్ ఉంచుకోవాలి. ♦ అందులోనూ ఆటో కట్ ఆఫ్ ఉండే పవర్ బ్యాంక్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సెల్ ఫోను బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ♦ సెల్ ఫోన్ చార్జింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ కంపెనీకి చెందిన ఒరిజనల్ చార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి. ♦ చాలా మంది రాత్రిపూట చార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. ఎక్కువ సేపు చార్జింగ్ పెడితే బ్యాటరీ పనితీరు దెబ్బతినడమే కాకుండా పేలిపోయే ప్రమాదం ఉంది. ♦ చార్జింగ్ సమయంలో సెల్‌ఫోన్ పరుపులపై మెత్తని వస్తువులపై ఉంచరాదు. లో ఓల్టేజి ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టకుండా ఉండడమే మంచిది. చార్జింగ్‌లో ఉండగా ఇయర్ ఫోన్స్ వాడరాదు. అలాగే గేమ్స్ ఆడరాదు. ఫోన్లు వస్తే తీసివేసిన తర్వాత ఫోన్ మాట్లాడాలి. ♦ బ్యాటరీ ఉబ్బినట్లు గమనిస్తే వెంటనే మార్చాలి. ఒకేసారి 0 నుంచి 100కి చార్జింగ్ చేస్తే బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చార్జింగ్ చేయాలి. ♦ 10 శాతం ఉండగానే చార్జింగ్ పెట్టడం మంచింది. ♦ ఫోన్ పొరపాటున నీళ్లలో పడిపోతే వెంటనే చార్జింగ్ పెట్టకండి. బ్యాటరీని నేరుగా ఎండలో పెట్టరాదు. నీడలో ఆరబెట్టాలి. అప్పటికీ ఆరకపోతే ఒక పాత్రలో బియ్యం తీసుకుని, అందులో బ్యాటరీ లేదా సెల్‌ఫోన్ ఒక రాత్రి అంతా ఉంచాలి. బియ్యానికి తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. తద్వారా బ్యాటరీలోని తేమ పోయి సెల్‌ఫోన్ యాథావిధిగా పని చేస్తుంది. ♦ చార్జింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ తీసివేస్తే మంచిది. విరిగిన, వైర్ కట్ అయిన చార్జర్లు ఉపయోగించరాదు. చాలా మంది సెల్ఫోన్లకు భద్రత అంటూ కవర్లు తగిలిస్తారు. దీని వల్ల చార్జింగ్ సమయంలో సెల్‌ఫోన్ వేడెక్కుతూనే ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ పాడవుతుంది. ♦ కొన్ని ఫోన్లలో బ్యాటరీ ఒక్క రోజులో లేదా గంటల వ్యవధిలో అయిపోతుంది. ఇలాంటి సమయంలో బ్యాటరీలు మార్చుకోవాలి. సెల్ఫోన్ల వాడకంలోజాగ్రత్తలు అవసరం ప్రస్తుతం సమాజంలో సెల్ఫోన్ల వాడకం బా గా పెరిగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వర కు అందరూ సెల్ఫోన్లు వాడుతున్నారు. గం టల తరబడి గేమ్స్ ఆడరాదు. ఫోన్ మాట్లాడరాదు. అలా చేయడం వల్ల వేడెక్కి పేలిపోతుంటాయి. రాత్రిళ్లు చార్జింగ్ పెట్టి నిద్రపోవడం మంచిది కాదు. సెల్‌ఫోన్ వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు. – దివాకర్, దివా సెల్‌ఫోన్, కంప్యూటర్ సర్వీస్ సెంటర్, మదనపల్లె -
పుట్టగొడుగులతో సెల్ ఫోన్ బ్యాటరీలు!
ఇకపై పుట్టగొడుగులు సెల్ ఫోన్లో బ్యాటరీలుగా మారనున్నాయా? విద్యుత్ వాహనంలో ఇంధనమై పోనున్నాయా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియా యూనివర్శిటీ రివర్ సైడ్ బోర్న్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధనల్లో వినూత్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్టబెల్లా మష్రూమ్స్ (పుట్టగొడుగులు) ను ఉపయోగించి కాలుష్యకారంకం కాని, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణానికి ఎలాంటి హాని కలగని లిథియమ్ అయాన్ బ్యాటరీ యానోడ్ ను ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు. ప్రస్తుత పరిశ్రమల్లో రీఛార్జబుల్ లిథియమ్ అయాన్ బ్యాటరీ యానోడ్లను తయారు చేసేందుకు అధిక ఖర్చును పెడుతున్నారు. దీనికి సింథటిక్ గ్రాఫైడ్స్ ను ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా శుద్ధి చేయాల్సిన పరిస్థితిలో వీటి ఉత్సత్తికి అత్యధికంగా ఖర్చవుతోంది. అంతేకాదు వీటిని తయారు చేసే పద్ధతి కూడ పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం బ్యాటరీలను వాడాల్సిన అవసరం పెరగడంతో ఖరీదైన గ్రాఫైట్ ను వాడే స్థానంలో తక్కువ ధరలో దొరికే పుట్ట గొడుగులను వాడొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. పుట్టగొడుగులతో బయోమాస్ రూపంలో గతంలో నిర్వహించిన పరిశోధనల్లో అవి పోరోస్ గా మారినట్లు గుర్తించారు. అదే పోరోసిటీ బ్యాటరీల తయారీకి అవసరమౌతుందని గ్రహించారు. పుట్టగొడుగుల్లో పొటాషియం, ఉప్పు గాఢతలను క్రమేపీ పెంచుతూ రంధ్రాలు పడేలా చేయడంవల్ల ఎలక్టోలైట్ క్రియాశీల పదార్థ సామర్థ్యాన్ని పెంచవచ్చని తెలుసుకున్నారు. ఇలా తయారైన సాంప్రదాయక యానోడ్ లిథియం బ్యాటరీ మెటీరియల్స్ భవిష్యత్తులో అత్యంత ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. కాల క్రమంలో కార్బన్ తో తయారు చేసిన బ్యాటరీల కంటే ఇటువంటి సాంప్రదాయక ఇంధనం వాడకం వల్ల సెల్ ఫోన్లలో బ్యాటరీలు సైతం ఎక్కువ సమయం డిశ్చార్జి అవ్వకుండా ఉండే అవకాశం ఉందంటుందని పరిశోధకులు చెప్తున్నారు. -
నిమిషంలో చార్జయ్యే ఫోన్ బ్యాటరీ
వాషింగ్టన్: ఒకే ఒక్క నిమిషంలో సెల్ఫోన్లను రీచార్జి చేయడమే కాకుండా ఎలాంటి ప్రమాదానికి అవకాశంలేని సురక్షితమైన అల్యూమినియం బ్యాటరీలను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పైగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లిథీయం-ఐయాన్, అల్కాలైన్ బ్యాటరీలకన్నా ఇవి చౌకైనవి, సురక్షితమైనవని యూనివర్శిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ హోంగ్జీ దాయ్ తెలియజేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో చెలామణి అవుతున్న అల్కాలైన్ బ్యాటరీలు పర్యావరణానికి హానికరమని, లిథీయం-ఐయాన్ బ్యాటరీలేమో అప్పుడప్పుడు పేలిపోతుంటాయని ఆయన చెప్పారు. అల్యూమినియంతో తాము తయారు చేసిన కొత్త బ్యాటరీలు డ్రిల్లింగ్ చేసినా సరే అంటుకోవని, పేలవని ఆయన స్పష్టం చేశారు. అల్యూమినియంతో తయారుచేసే బ్యాటరీలు చౌకగా లభించడమే కాకుండా కేవలం 60 సెకండ్లలో ఎక్కువ చార్జింగ్ కెపాసిటీ ఉంటుందని ఆయన చెప్పారు. వీటి వల్ల మరో ఉపయోగం ఉందని, అల్యూమినియం బ్యాటరీలను అవసరమైతే మడతపెట్టే అవకాశం ఉందని, దీనివల్ల భవిష్యత్ స్మార్ట్ ఫోన్లకు అనుకూలంగా వీటిని తయారు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.