
మదనపల్లె టౌన్ : చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో శుక్రవారం పాడైపోయిన ఓ సెల్‌ఫోన్‌లోని బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కురబలకోట బీసీ కాలనీకి చెందిన ఇస్మాయిల్, అయేషా దంపతుల కుమారులు షేక్ సయ్యద్ (10), మౌలాలి (8) స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు, మూడు తరగతులు చదువుతున్నారు.
వేసవి సెలవులు కావడంతో ఇంటివద్దనే ఉన్న ఈ పిల్లలు శుక్రవారం ఇంటికి సమీపంలో దొరికిన పాత సెల్‌ఫోన్‌లో ఉన్న బ్యాటరీ బయటకు తీసి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బాగా ఉబ్బిపోయి ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో అన్నదమ్ములు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే 108లో చిన్నారులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మౌలాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నెట్టికంటయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment