నిమిషంలో చార్జయ్యే ఫోన్ బ్యాటరీ
వాషింగ్టన్: ఒకే ఒక్క నిమిషంలో సెల్‌ఫోన్లను రీచార్జి చేయడమే కాకుండా ఎలాంటి ప్రమాదానికి అవకాశంలేని సురక్షితమైన అల్యూమినియం బ్యాటరీలను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పైగా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న లిథీయం-ఐయాన్, అల్కాలైన్ బ్యాటరీలకన్నా ఇవి చౌకైనవి, సురక్షితమైనవని యూనివర్శిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ హోంగ్జీ దాయ్ తెలియజేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో చెలామణి అవుతున్న అల్కాలైన్ బ్యాటరీలు పర్యావరణానికి హానికరమని, లిథీయం-ఐయాన్ బ్యాటరీలేమో అప్పుడప్పుడు పేలిపోతుంటాయని ఆయన చెప్పారు. అల్యూమినియంతో తాము తయారు చేసిన కొత్త బ్యాటరీలు డ్రిల్లింగ్ చేసినా సరే అంటుకోవని, పేలవని ఆయన స్పష్టం చేశారు.
అల్యూమినియంతో తయారుచేసే బ్యాటరీలు చౌకగా లభించడమే కాకుండా కేవలం 60 సెకండ్లలో ఎక్కువ చార్జింగ్ కెపాసిటీ ఉంటుందని ఆయన చెప్పారు. వీటి వల్ల మరో ఉపయోగం ఉందని, అల్యూమినియం బ్యాటరీలను అవసరమైతే మడతపెట్టే అవకాశం ఉందని, దీనివల్ల భవిష్యత్ స్మార్ట్ ఫోన్లకు అనుకూలంగా వీటిని తయారు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.