‘ఉగ్రవాదంపై జర్మనీలో రోడ్లెక్కిన ముస్లింలు’
బెర్లిన్: తొలిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జర్మనీలో పలు ముస్లిం సంఘాలు ఏకమయ్యాయి. తామంతా ఉగ్రవాదానికి వ్యతిరేకం అని, రక్తదాహంతో భూమిని నరకంగా మారుస్తున్న చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రోడ్లెక్కారు. ఈ మేరకు జర్మనీలో ముస్లిం సమాజమంతా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్లీలతో నినాదాలు చేస్తూ ముందుకు కదిలింది. అయితే, ఈ కార్యక్రమ నిర్వాహకులు భావించినట్లుగా పెద్దగా విజయవంతం కాలేదు. వేలమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావించినప్పటికీ కేవలం వందల సంఖ్యలోనే పాల్గొన్నారని మెల్లగా వెయ్యిమంది వరకు చేరిందని జర్మనీలోని ఓ స్థానిక వార్తా సంస్థ తెలిపింది.
‘ముస్లింలు, వారి స్నేహితులు ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకం’ రంజాన్ మాసంలో భాగంగా ‘రంజాన్ శాంతి ర్యాలీ’ అంటూ పశ్చిమ జర్మనీలోని కోలోగ్న్‌లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా, జర్మనీలో అతిపెద్ద ముస్లిం కూటమి అయిన టర్కిష్ ఇస్లామిక్ యూనియన్ మాత్రం ఇందులో భాగస్వామ్యం కాలేదు. ఇలాంటి ర్యాలీలు తీస్తే ముస్లింల వల్లే ఉగ్రవాదం వ్యాప్తిస్తుందనే తప్పుడు సందేశం ప్రపంచ సమాజంలోకి వెళుతుందనే తాము ఆ ర్యాలీలో పాల్గొనలేదని ఆ సంస్థ తెలిపింది.