'వెళతావా.. పోలీసులను పిలవనా'
చికాగో: ముసుగు ధరించి వచ్చిందని ఓ ముస్లిం మహిళను అమెరికాలోని ఓ స్టోర్ సిబ్బంది బయటకు పంపించారు. బురఖా ధరించిన తమ దుకాణంలోకి రావొద్దంటూ ఆ రిటెయిల్ అవుట్ లెట్ నుంచి బయటకు పంపించి వివక్ష చూపించారు. ఇండియాలోని గ్యారీ అనే ప్రాంతానికి చెందిన సారా షఫీ అనే ముస్లిం మహిళ తమ సంప్రదాయం ప్రకారం దుస్తులు(బురఖా) వేసుకొని షాపింగ్ కు వెళ్లింది. అలా లోపలికి నాలుగు అడుగులు వేసిందో లేదో వెంటనే కౌంటర్ లో కూర్చున్న ఆమె 'మేడమ్ ముసుగుతీసేయండి లేదంటే.. మా షాపునుంచి వెళ్లిపోండి' అంటూ చెప్పింది. తన కన్నపిల్లల ముందే ఆమె ఈ అవమానం చవిచూసింది.
ఆ షాపులో పనిచేసే వ్యక్తికి సారా సమాధానం ఇచ్చే క్రమంలోనే తన మొబైల్ ఫోన్ ఆన్ చేసి ఆ సంభాషణను రికార్డు చేసింది. తాను తమ సంప్రదాయ బద్ధంగానే అలా నిఖాబ్ ధరించానని చెప్పగా క్లర్క్ మాత్రం అలా కుదరదని, ఆ ముసుగు తీసేయాలని, లేదంటే వెళ్లిపోవాలని చెప్పింది. తాను అర్థం చేసుకోగలను కానీ, ఇక్కడ ఇటీవల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే ఇలా చెప్పాల్సి వస్తుందని చెప్పింది. అయితే, ఇలా ధరించడం తన హక్కు అని చెప్పగా పోలీసులను పిలవమంటారా అని హెచ్చరించింది. ఈ సంఘటన ఇప్పుడు బయటకు తెలిసి పెద్ద సంచలనంగా మారింది.