వాషింగ్టన్: ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ విషయంలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే వలస వచ్చినవారు, మైనారిటీలు తీవ్రంగా భయపడినమాట, కంగారుపడినమాట వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలన విభాగంలో దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాలకు సహాయ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న నిశా దేశాయ్ బిస్వాల్(మైగ్రెంట్ ఇండియన్) తెలిపారు. తన ఇంట్లో నుంచే తనకు ఆ అనుభవం ఎదురైందని చెప్పారు. ట్రంప్ గెలిస్తే మనం వెళ్లిపోవాలా అమ్మా అంటూ తన పిల్లలే ప్రశ్నించారని తెలిపారు. జనవరి 20(శుక్రవారం)న డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నారు.
మరోపక్క, ఆయనను వ్యతిరేకిస్తూ ఇప్పటికీ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిస్వాల్ స్పందిస్తూ ఎన్నికలకు ముందు ఉన్న భయమే ప్రజల్లో ఇప్పటికీ ఉందన్నారు. 'ట్రంప్ వస్తున్న నేపథ్యంలో దేశంలోని చాలా చోట్ల కొన్ని ప్రత్యేక వర్గాల్లో, వలస వచ్చినవారిలో, తక్కువ ఆదాయం కలిగిన వారిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారంతా భయపడుతున్నారు. ముఖ్యంగా ఏ వర్గాల వారు ఇప్పటికే తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారో వారి భయం ఎక్కువైంది. అంతెందుకు నాకు కూడా ఎన్నికలకుముందు దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది.
ట్రంప్ విజయంసాధిస్తే మనం వలస వచ్చినవాళ్లం కాబట్టి వెళ్లిపోవాలా అమ్మా అంటూ నా తొమ్మిదేళ్ల, ఏడేళ్ల పిల్లలు ప్రశ్నించారు. భయపడ్డారు. కానీ, నేను వారికి మనం అమెరికన్లమే. ఇక్కడ ఉండేందుకు కావాల్సిన అన్ని హక్కులు ఉన్నాయి అని ధైర్యం చెప్పాను' అని ఆమె తన అనుభవాన్ని చెప్పారు. ఒక్క అమెరికన్లకు మాత్రమే కాకుండా ఈ దేశానికి ముఖ్యమైనవారందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం ట్రంప్ పాలన వర్గంపై ఉందని ఆమె అన్నారు.