నగరం కింద మరో నగరం
లండన్: మొన్న మహారాష్ట్ర రాజభవన్ కింద ఓ భారీ సొరంగంలో పెద్ద నిర్మాణం బయటపడినట్లు బ్రిటన్లోని చారిత్రకంగా ప్రసిద్ధ చెందిన నగరం దుర్హామ్ కింద మరో నగరం బయటపడింది. ఇప్పటికే ఉన్న ఈ నగరం కింద అబ్బురపరిచే మాయానగరంలాంటి కట్టడాలు బయల్పడ్డాయి. అందులో చిన్నచిన్న నివాసాలు, టన్నెల్స్ బయల్పడ్డాయి. ఇప్పటికీ చెక్కు చెదరని కిటికీలు, తలుపులతోపాటు, అప్పట్లో దివిటీలకోసం ఉపయోగించిన కాగడాలు కూడా చెక్కుచెదరకుండా దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది 250 సంవత్సరాల కింద నిర్మించిన నగరంగా చరిత్ర కారులు భావిస్తున్నారు.
ఏకంగా ఒక వీధికి వీధి చెక్కు చెదరకుండా మరికొన్ని వీధులు కొంత ధ్వంసం అయి కనిపిస్తున్నాయి. జెప్ హైఫీల్డ్(49) అనే వ్యక్తి దీనిని వెలుగులోకి తెచ్చాడు. ప్రస్తుతం గృహనిర్మాణాలు ఎలా ఉన్నాయో అచ్చం అలాగే ఉన్నాయి. ప్రత్యేకంగా ఇళ్లల్లో వస్తువులు పెట్టుకునేందుకు ఇప్పుడు మనం అమర్చుకుంటున్న అరల మాదిరిగానే 250 ఏళ్ల కిందట ఇవి ఉండటం గమనార్హం. వీటిల్లో కొన్నింటిని పునరుద్ధరించి తిరిగి లగ్జరీ హోటల్ గదులుగా, తాత్కలిక నివాసాలుగా మారుస్తామని జెఫ్ చెప్తున్నాడు. ఇందులో పశువుల కొట్టాలు, మార్కెట్ ప్రాంగణాలు, విలువైన వస్తు విక్రయాల అంగడి గదులు కూడా ఉన్నాయంట. అయితే, దీని కచ్చితమైన చరిత్రను తెలుసుకునేందుకు స్పష్టమైన ఆధారాలు మాత్రం లభ్యం కావడం లేదని, వాటికోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు.