‘ఉగ్ర’ నియంత్రణతోనే శాంతి, భద్రత | NAM summit calls for decisive action on terror | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ నియంత్రణతోనే శాంతి, భద్రత

Published Tue, Sep 20 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

NAM summit calls for decisive action on terror

నామ్‌ డిక్లరేషన్‌లో వెల్లడి

పోర్లమార్‌(వెనిజులా): ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాలని ప్రపంచ దేశాలకు నామ్‌(అలీన కూటమి) సభ్యదేశాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ సమాజంలో శాంతి, భద్రతకు ఇది పెను ముప్పుగా మారిందని, ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడం, అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయడాన్ని నిరోధించాలని కోరాయి. 17వ నామ్‌ సదస్సు చివరి రోజైన సోమవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్‌ తరఫున ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఈ సమావేశాలకు హాజరయ్యారు.

మతం,నమ్మకాల ఆధారంగా కొన్ని ఉగ్ర సంస్థలు సాంస్కృతిక, వారసత్వ కట్టడాల విధ్వంసానికి పాల్పడడం, మానవ జాతిపై నేరాలకు ఒడిగట్టడాన్ని కూటమి ఖండించింది. ఉగ్ర సంస్థలు తాలిబన్, ఆల్‌ఖైదా, ఐసిస్‌ దాని అనుబంధ సంస్థలు జబాత్‌ అల్‌ నుర్సా, బోకో హారం, అల్‌ షబాబా , ఐక్యరాజ్య సమితి గుర్తించిన కొన్ని సంస్థల కార్యకలాపాలు, ఉగ్ర వ్యాప్తికి అవి కల్పిస్తున్న వాతావరణాన్ని గర్హించింది. ఐరాస చార్టర్, ఇతర అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు మరింత సమర్థంగా, సమన్వయంతో ఈ ముప్పును ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతమున్న ఐరాస ఉగ్ర వ్యతిరేక వ్యూహ అమలు తదితరాలకు అదనంగా భవిష్యత్తులో మరో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చునే దిశగా కూటమి ఆలోచన మొదలెట్టింది.

తీవ్రవాదాన్ని ఏదో ఒక మతం, వర్గం, జాతితో ముడిపెట్టకూడదని, వీటిని తీవ్రవాద కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ఉపయోగించుకోకూడదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఉగ్ర వ్యతిరేక చర్యల కింద అనుమానితుల వివరాలు బయటపెట్టడానికి, వ్యక్తుల గోప్యతపై దాడికి వాడుకోవద్దని తెలిపారు. ఉగ్ర ముప్పును ఎదుర్కోవాలంటే నిర్దిష్ట చర్యలు అవసరమని, ప్రభావవంత సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని 120 దేశాల బృందాన్ని భారత్‌ ఆదివారం కోరింది.

ఉద్యమానికి సంఘటితమవుదాం
అలీన ఉద్యమ పునరుత్తేజం, పటిష్టానికి సభ్య దేశాలు మద్దతును పునరుద్ఘాటించాయి. ఐరాస చార్టర్, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు వివాదాలను పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. చట్టబద్ధ ప్రభుత్వాలను కూలదోసే అక్రమ విధానాలను తిరస్కరించాయి. ఏదైనా దేశం సమగ్రత, ఐక్యతకు భంగం కలిగించే యత్నాల పట్ల వ్యతిరేకత కొనసాగుతుందని పునరుద్ఘాటించాయి. ఇతర దేశాల సారభౌమత్వాన్ని గౌరవించాలని, వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోరాదని, బల ప్రయోగం, బెదిరింపులకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.

అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పనిచేయాలని తీర్మానించాయి. అణు నిరాయుధీకరణ కోసం తక్షణం చర్చలు ప్రారంభం కావాలని పిలుపునిచ్చాయి. శాంతియుత ప్రయోజనాల కోసం అణు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే దేశాల సారభౌమత్వాన్ని పునరుద్ఘాటించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement