
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై జీవితకాల అనర్హత వేటు వేసిన సుప్రీం కోర్టు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవితకాలం ఆయన ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని పాక్ సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ దేశ అత్యున్నత న్యాయస్ధానం వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనర్హత వేటు వంటి చర్యలు అవసరమని చారిత్రక తీర్పును వెలువరిస్తూ కోర్టు పేర్కొంది.
నవాజ్ షరీఫ్‌తో పాటు పాకిస్తాని తెహ్రీక ఇన్సాఫ్ (పీటీఐ) సెక్రటరీ జనరల్ జహంగీర్ తరీన్‌పైనా జీవిత కాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
కాగా, పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పాక్ సుప్రీం బెంచ్ గత ఏడాది జులై 28న నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పాక్ మాజీ ప్రధాని జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment