నవాజ్ షరీఫ్ దేశం వదిలిపోతున్నారా?
లాహోర్(పాకిస్తాన్): అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్(67) దేశం వదిలి వెళ్లిపోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి ప్రతిపక్షాలు. గొంతు కేన్సర్‌తో లండన్‌లో చికిత్స పొందుతున్న తన భార్య కుల్సూమ్‌తో గడిపేందుకు ఆయన బుధవారం లండన్ వెళ్తున్నారని ఓ మంత్రి తెలిపారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బక్రీద్ పండుగ జరుపుకుంటారని, తిరిగి వారం తర్వాత స్వదేశానికి వస్తారని వివరించారు. నవాజ్ షరీఫ్ కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె ఆస్మా ఇప్పటికే లండన్‌లో ఉన్నారు. పనామా పత్రాల లీకేజీ కేసులో నవాజ్‌షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించటంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఖాళీ అయిన లాహోర్ స్థానంలో భార్య కుల్సూమ్‌ను ఎన్నికల బరిలోకి దించారు. ఆమె తరఫున మరో కుమార్తె మరియం ప్రచార బాధ్యతలను చేపట్టారు. తన తండ్రితోపాటు లండన్ వెళ్లాలనుకున్నప్పటికీ ప్రచారం కోసం పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఎన్నికలో తల్లిని గెలిపించటమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రచార బాధ్యతలను పార్టీలోని వేరే నాయకులకు అప్పగించటం మరియంకు ఇష్టం లేదని పీఎంఎల్-ఎన్ నాయకుడు ఒకరు తెలిపారు. అయితే అవినీతి, దొంగచాటుగా డబ్బు తరలించారనే ఆరోపణలపై ఇక్కడ అరెస్టు తప్పదనే అనుమానంతోనే ఆయన లండన్ వెళ్లిపోయారని, తిరిగి వచ్చే అవకాశాలు లేవని పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, షరీఫ్ ఆయన కుమారులపై మరో నాలుగు కేసులను నమోదు చేసింది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన స్వదేశానికి తిరిగి ఇప్పట్లో రాకపోవచ్చని పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు అలీమ్ ఖాన్ వ్యాఖ్యానించారు.