మాజీ ప్రధాని భార్యకు క్యాన్సర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పనామా కుంభకోణంతో ప్రధానమంత్రి పదవిని షరీఫ్ కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య కుల్సుమ్ నవాజ్‌కు గొంతు సంబంధిత క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న కుల్సుమ్‌కు అక్కడే శస్త్ర చికిత్స చేయిస్తారని తెలిసింది.
నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు అనంతరం ఖాళీ అయిన స్థానంలో పోటీ చేసేందుకు కుల్సుమ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాహోర్‌లోని ఎన్‌ఏ-120 స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఈసీకి అభ్యంతరాలు రావడంతో వైద్య పరీక్షల కోసం కుల్సుమ్ లండన్‌కు వెళ్లారు.
వైద్య పరీక్షల్లో గొంతు సంబంధిత క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అయితే, కుల్సుమ్‌కు వచ్చిన క్యాన్సర్ తొలి దశలో ఉండటం వల్ల వ్యాధిని నయం చేయడానికి అవకాశం ఉందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.