వెనిస్‌ను మించిన అందాలు
ఇటలీలోని వెనిస్ నగరం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది... నగరం నడిబొడ్డులోని నీటి మార్గాలు. బోట్లలో వెళుతూ షాపింగ్ చేయడం, కాయగూరలు, పళ్లు కొనడం... ఇవన్నీ తెలిసినవే. అయితే వెనిస్ నిత్యం విపరీతమైన పర్యాటకుల రద్దీతో గోలగోలగా ఉంటుంది. అలాకాకుండా ప్రకృతి ఒడిలో సేదదీరుతున్న అనుభూతిని కలిగించే పట్టణమే నెదర్లాండ్‌లోని ఓవరిజ్‌సెల్ ప్రావిన్స్‌లోని ఐడిలిక్ గిథూర్న్.
2,600 మంది నివసించే ఈ పట్టణంలో రోడ్లుండవు. దారులన్నీ నీటి మార్గాలే. ఏ వీధికి, ఏ ఇంటికి వెళ్లాలన్నా... బోటులోనే ప్రయాణం. అదీ అసలు శబ్దం చేయని ఇంజిన్‌లను బిగించిన బోట్లు. లేదా నదికి ఇరువైపులా పేవ్‌మెంట్లలా ఉండే మార్గాలపై నడిచివెళ్లాలి.
నడిచి వెళ్లేవారికోసం నీటి మార్గాలపై ఏకంగా 176 చెక్క బ్రిడ్జిలు ఉన్నాయట. చాలా ప్రశాంతంగా ఉండే ఈ పట్టణాన్ని చూడటానికి ఇప్పుడిప్పుడే పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారట. అయితే వాహనాలనీన టౌన్ ఎంట్రెన్స్‌లోనే వదిలి... ఇదిగో పక్క చిత్రంలో కనిపిస్తున్నట్లుగా బోటు పట్టాల్సిందే.