
బ్రాహ్మచారులు మద్యం మానాలంటే.. ఇదిగో చిట్కా!
న్యూయార్క్: కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు చెప్పింది నిజమే అని సైన్స్ కూడా చెబుతోంది. వ్యక్తుల ప్రవర్తనలపై జరిపిన అధ్యయనాల్లో ఒంటరిగా ఉండేవాళ్లకంటే జతగా ఉన్నవాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారట. మరీ ముఖ్యంగా మద్యం తాగే అలవాటు కూడా ఒంటరిగా ఉండేవాళ్లకంటే మరొకరితో కలిసుండే వారికే తక్కువగా ఉంటుందట. ఒక వేళ ఎవరైతే ఒంటరిగా ఉండి విపరీతమైన తాగుడుకు బానిసలుగా ఉంటారో వారు ఆ అలవాటు నుంచి బయటపడేందుకు వెంటనే ఎవరితోనైనా స్నేహం చేయడమో.. లేకపోతే పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామిని ఆహ్వానించడమో చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
వర్జీనియాలోనో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన డియానా డినెస్కు అనే రచయిత ఈ విషయంపై వివరణ ఇస్తూ .. 'ఒంటరిగా ఉండటంకన్నా మరొకరితో కలిసి ఉండటం మేలు. దాని ద్వారా మద్యం అలవాటును తగ్గించుకోవచ్చు. మేం చేసిన అధ్యయనంలో ఎవరైతే వివాహం చేసుకున్నారో వారికి మద్యం తాగే అలవాటు బాగా తక్కువగా ఉంది. అదే ఒంటరిగా ఉండే వాళ్లు ఇష్టం వచ్చినంత ఘాటుమందు తాగుతారని తెలిసింది' అని ఆయన చెప్పారు. ఇద్దరు కవలలను తమ అధ్యయనానికి తీసుకున్నట్లు చెప్పారు. ఆ కవలల్లో ఒకరు ఒంటరివారు కాగా.. మరొకరు వివాహం అయిన వాళ్లు. దీంతోపాటు ఓ వెయ్యి జంటలపై కూడా ఒంటరివారి ప్రవర్తనలు, అలవాట్లపై అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు.