
దావూద్ చిరునామా ఇదే!!
పాకిస్థాన్ దక్షిణ కరాచీలోని క్లిఫ్టన్ నైబర్‌హుడ్ అత్యంత విలాసవంతమైన ప్రాంతం.
పాకిస్థాన్ దక్షిణ కరాచీలోని క్లిఫ్టన్ నైబర్‌హుడ్ అత్యంత విలాసవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సింధ్ మాజీ ముఖ్యమంత్రి ముస్తఫా జాతోయ్ నివాసముంటున్నారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టోకి కూడా ఇక్కడో పెద్ద బంగ్లా ఉంది. పాక్‌లోని ప్రముఖులు నివసించే ప్రాంతంగా పేరొందిన ఇదే ప్రదేశంలో ఓ కరుడుగట్టిన నేరగాడు కూడా యథేచ్ఛగా నివసిస్తున్నాడు. 1993లో బొంబాయిలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి.. 257 మందిని పొట్టనబెట్టుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నివాసముంటున్నది ఇక్కడే. ఇతంటి విలాసవంతమైన ప్రాంతంలో ఓ భారీ భవంతిలో నిర్భయంగా బతుకున్నాడు దావూద్.
అతన్ని పట్టుకొని.. భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ గత 23 ఏళ్లలో లెక్కలేని ప్రయత్నాలు చేసింది. అతడు పాక్‌లోనే ఉన్నాడని భారత్ ఎన్ని ఆధారాలు చూపినా.. దాయాది దేశం మా దగ్గర లేడని బొంకేది. తాజాగా ఓ ఆంగ్ల మీడియా దావూద్ సంచలన స్టింగ్ ఆపరేషన్ జరిపింది. క్లిఫ్టన్‌లో ఉన్న దావూద్ ఇంటి చిరునామాను సాధించింది. డీ 13, బ్లాక్ 4, క్లిఫ్టన్, కరాచీ చిరునామాలో అతడు ఉంటున్నట్టు కనుగొన్నది. దావూద్ ఇంటి సమీపంలోని భవంతులపై నుంచి విహంగ విక్షణం ద్వారా అతని ఇంటి ఫొటోలను, అతని ఇంటి పరిసరాల ఫొటోలను ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వాహకులు తీశారు. దావూద్ బంగ్లాకు సమీపంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, దావూద్ భవంతి ఉన్న విలాసవంతమైన ప్రాంతం ఫొటోను క్లిక్ మనిపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేస్తూనే ఈ ఆధారాలను కూడా పాక్ ప్రభుత్వం తిరస్కరించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.