రోమ్: కరోనా కరాళ నృత్యం చేసిన ఇటలీలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గడంతో ఆ దేశం ఊపిరి పీల్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటలీ వైద్యులు శుభవార్త తెలిపారు. ప్రస్తుత కరోనా వైరస్‌లో శక్తి సామర్థ్యం బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. అంతేకాక ఈ వైరస్ ప్రజలకు తక్కువ ప్రాణాంతకమేనని వెల్లడించారు. లాంబర్డీలోని సాన్ రఫాలే ఆస్పత్రి ప్రధాన వైద్యుడు అల్బర్టో జాంగ్రిల్లో ఈ మేరకు పలు విషయాలు పేర్కొన్నారు. గత 10 రోజులుగా చూస్తోన్న వైరస్‌కు రెండు నెలల క్రితం చూసిన వైరస్‌కు గణనీయమైన తేడా ఉందన్నారు. దీనివల్ల ప్రజల ప్రాణాలకు కూడా పెద్దగా ముప్పు ఉండదని స్పష్టం చేశారు. మరో సీనియర్ వైద్యుడు మాట్టియో బాస్సెట్టి సైతం కరోనా బలహీనపడిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఉన్న శక్తిసామర్థ్యాలు ప్రస్తుత వైరస్‌కు లేవని తెలిపారు. (కరోనా: ఇటలీలో ఇంత తక్కువ.. ఫస్ట్‌టైమ్!)
కాగా 2,33,019 కేసులతో ప్రపంచ కరోనా ప్రభావిత దేశాల్లో ఇటలీ ఆరో స్థానంలో ఉంది. 33,415 మంది మరణాలతో కోవిడ్ మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఇక కరోనా ధాటికి కొన్ని నెలల క్రితం ఇటలీ చిగురుటాకులా వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ ప్రాణ నష్టాన్ని చవిచూసింది. దీనికి సంబంధించిన ఎన్నో హృదయ విదారక వీడియోలు నెట్టింట్లోనూ చక్కర్లు కొట్టాయి. లాక్‌డౌన్‌తో పాటు కఠినమైన ఆంక్షలు విధించడంతో మే నెలలో అక్కడ కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. (కరోనా వచ్చినా కంగారు పడలేదు!)
Comments
Please login to add a commentAdd a comment