
కౌరీ వృక్షం
వెల్లింగ్‌టన్ : న్యూజిలాండ్ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే వృక్షం మృత్యువుతో పోరాడుతోంది. ఆ దేశంలోని కౌరీ వృక్షాల్లో ఇదే అత్యంత పురాతనమైనది కూడా. దీని వయసు దాదాపు 2500 ఏళ్లు. అందుకే దీన్ని టేన్ మహుటా(అడవి రాజు)అని ముద్దుగా పిలుచుకుంటారు. 13.77 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల ఎత్తు ఉండే ఈ చెట్టు ఉత్తర న్యూజిలాండ్‌లోని వైపోవా అటవీ క్షేత్రంలో ఉంది. కౌరీ జాతి వృక్షాలకు మాత్రమే సోకే అరుదైన కౌరీ డైబ్యాక్ వ్యాధి సోకడంతో టేన్ మహుటా అతి త్వరలో మరణించబోతోంది. దీంతో వేలాది మంది ఈ వృక్షాన్ని చివరిసారిగా సందర్శించేందుకు క్యూ కడుతున్నారు.
ఏంటీ కౌరీ డైబ్యాక్ వ్యాధి?
కౌరీ డైబ్యాక్ అనేది ఓ ప్రత్యేకమైన శిలీంధ్ర వ్యాధి. దీన్ని నిర్మూలించేందుకు ప్రస్తుతం మందు లేదు. దీంతో పవిత్రంగా భావించే కౌరీ వృక్షాలను సంరక్షించడం న్యూజిలాండ్‌లోని అటవీ శాఖ అధికారులకు సవాలుగా మారింది. అందుకే చెట్టును సందర్శించేందుకు వచ్చే యాత్రికుల నుంచి ఎలాంటి వ్యాధులు కౌరీ వృక్షానికి సోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఎంతో అందంగా కనిపించే కౌరీ చెట్లు చాలా బలమైనవి. వీటి చెక్కను పడవలు, ఇళ్లు నిర్మాణాల్లో వినియోగిస్తారు. అయితే, కౌరీ డైబ్యాక్ వ్యాధి ధాటికి పరిస్థితి మారిపోయింది. ఎక్కడో ఒకచోట అరుదుగా ఈ వృక్షం ప్రస్తుతం కనబడుతోంది.
న్యూజిలాండ్ అడవుల్లోని మావోరి తెగ ప్రజలు కౌరీ వృక్షాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ సాయం కోసం కూడా అర్థిస్తున్నారు. టేన్ మహుటాకు వ్యాధి సోకి ఆరు నెలలు అవుతోందని లింకన్ విశ్వవిద్యాలయంలోని బయో ప్రోటెక్షన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన అమాండా బ్లాక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment