ఉగ్రవాదులను ఉరికించి.. బందీలను విడిపించి..
అబుజా: నైజీరియా సైన్యాలు గొప్ప సాహసం చేశాయి. బొకోహారమ్ ఉగ్రవాదుల చెర నుంచి దాదాపు 61మంది బందీలను విడిపించాయి. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టాయి. చెర నుంచి విముక్తి అయినవారిలో మహిళలు, చిన్నపిల్లలు మాత్రమే అధికంగా ఉన్నారు. నైజీరియా సైన్యం యుద్ధ విమానాల ద్వారా ఈ చర్యను చేపట్టింది. ముందుగా ఆ జిహాదిస్టులు ఉన్న ప్రాంతాలను గుర్తించిన సైన్యం బందీలకు ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తగా దాడులు నిర్వహించింది.
అనంతరం ఆ ప్రాంతంలో దిగి నలుగురు ఉగ్రవాదులను హతం చేసింది. అక్కడే ఉన్న మరికొందరు ఉగ్రవాదులు పారిపోగా 61మందికి విముక్తి లభించినట్లయింది. ఇటీవల బొకో హారమ్ ఉగ్రవాదుల విషయంలో నైజీరియా బలగాలు తరుచుగా పై చేయి సాధిస్తున్నారు. గత అక్టోబర్ 28న కూడా 330 మంది బందీలను విముక్తి చేశారు. వీరిలో కూడా మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. బొకోహారమ్ ఉగ్రవాదులు ఎప్పుడు మహిళలను చిన్నారులను ఎక్కువగా ఎత్తుకెళుతుంటారు.