Boko Haram
-
మిలిటరీ యూనిట్‌పై దాడి.. 40 మంది మృతి!
అబుజా: మధ్య ఆఫ్రికా దేశమైన చాద్‌లో మిలిటరీ యూనిట్‌పై జిహాదిస్ట్ గ్రూప్ బోకో హరామ్ దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.‘‘నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న చాద్ లేక్ ప్రాంతంలోని సైనిక స్థావరాన్ని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి బోకో హరామ్ గ్రూప్ సభ్యులు 200 మందికి పైగా సైనికులు ఉన్న యూనిట్ లక్ష్యంగా దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఘటనాస్థలిని సందర్శించా. ఈ దాడికి పాల్పడిన వారి రహస్య స్థావరాలను గాలించేందుకు ఆపరేషన్ ప్రారంభించాం’’ అని చాద్ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబి ఇట్నో ఓ ప్రకటన విడుదల చేశారు.🇹🇩|#Chad: An attack yesterday on a military base in #Barkaram, Kaya department has left approx 40 soldiers dead. The base, found in the Lake Chad region, is speculated to have been attacked by Boko Haram, others have suggested that rebels are responsible. pic.twitter.com/CDr3SNfOqT— Charlie Werb (@WerbCharlie) October 28, 2024 పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ 2009లో ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ గ్రూప్.. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకుంది. ఇప్పటివరకు వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. కొన్ని లెక్కల ప్రకారం.. ఈ గ్రూప్ మూడున్నర లక్షల మందిని పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోందది. వీరి దాడులకు లక్షలాది మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టి వలసవెళ్లటం గమనార్హం. చదవండి: ప్రచారంలో ట్రంప్ జోష్.. భార్యతో కలిసి డ్యాన్సులు -
82 మంది విద్యార్థినులకు విముక్తి
అబుజా: ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా నైజీరియాలోని ఉగ్రవాద సంస్థ బొకోహరమ్ చెర నుంచి మరో 82 మంది ‘చిబోక్’ విద్యార్థినులు విడుదలయ్యారు. వారు దేశాధ్యక్షుడు మహమ్మద్ బుహారీని కలవనున్నారు. 2014 ఏప్రిల్ 14న బొకోహరమ్ ఉగ్రవాదులు చిబోక్ పట్టణంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై దాడి చేసి 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేశారు. అనంతరం 57 మంది తప్పించుకోగా, 219 మంది బందీలుగా మిగిలిపోయారు. వారిని ఇస్లాంలోకి మార్పించినట్లు అనంతరం బొకోహరమ్ వీడియో సందేశంలో పేర్కొంది. చర్చల ఫలితంగా గత అక్టోబర్‌లో 21 మంది బాలికలు ఉగ్రవాదుల చెర నుంచి విడుదలయ్యారు. ఆరు నెలల అనంతరం మరో 82 మంది విద్యార్థినులు విడుదలై నట్లు అధ్యక్ష భవనం తెలిపింది. అయితే ఇందుకుగాను ఎంతమంది ఉగ్రవాదులను విడుదల చేయనున్నారో మాత్రం వెల్లడించలేదు. -
శరణార్ధులపై ఆత్మాహుతి దాడులు
నైజీరియా: నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. శరణార్ధుల క్యాంపులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఉగ్రవాదుల తాకిడిని తట్టుకోలేక నైజీరియాకు ఈశాన్య దిక్కున ఉన్న మైదుగురి ప్రాంతంలోకి వలస వెళ్లి కొన్ని టెంట్ల కింద శరణార్థులుగా ఉంటున్నవారిపై ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుధవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు ఆత్మాహుతి దాడులు వరుసగా జరిగాయని ఈ దాడుల్లో క్యాంపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, టెంట్లు పూర్తిగా కాలిపోయాయని అక్కడి అధికారులు చెప్పారు. కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు తెలిపారు. అయితే, ఎంతమంది చనిపోయారనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎజెన్సీకి చెందిన అధికారి ఇబ్రహీం అబ్దుల్కాదిర్ మాట్లాడుతూ ‘మునా క్యాంపుల్లో బాంబుదాడులు జరిగాయి. నాలుగు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది. మా వాళ్లు అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది’ అని చెప్పారు. -
పొరపాటున బాంబేశారు..100 మంది మృతి
నైజీరియా: ఉగ్రవాదులపై వేయాల్సిన బాంబును పొరపాటున శరణార్థుల శిబిరంపై వేయడంతో 100 మందికి పైగా మృతి చెందిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. కామెరూన్ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో.. బోకోహారమ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ విమానం శరణార్థుల శిబిరంపై బాంబు జారవీడిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను నైజీరియా మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబొర్ ధృవీకరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని బోర్నో స్టేట్ గవర్నమెంట్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధితుల్లో శరణార్థులతో పాటు శిబిరంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేషన్స్ వితౌట్ బార్డర్స్, రెడ్ క్రాస్ సంస్థల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. -
బాలికలు బాంబులు పేల్చుకుని విధ్వంసం!
మైదుగురి: రెండు రోజుల కిందట తరహాలోనే మరో ఇద్దరు బాలికలు విధ్వంసం సృష్టించారు. దీంతో కొందరు సైనికులు కూడా మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నైజీరియాలోని మైదుగురి నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. విక్టర్ ఐసుకు అనే పోలీస్ అధికారి కథనం ప్రకారం.. నైజీరియా వాయవ్యప్రాంతంలో ఉన్న మైదుగురి సిటీ మార్కెట్లో అప్పటివరకూ అంతా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు గుర్తుతెలియని పదేళ్లలోపు వయసున్న బాలికలు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేపింది. ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదన్నారు. మొదట మార్కెట్లో ఓ బాలిక ఆత్మాహుతి దాడికి పాల్పడగా కొన్ని సెకన్లలోనే మరో బాలిక విధ్వంసానికి పాల్పడిందని విక్టర్ ఐసుకు అనే పోలీసు తెలిపాడు. బొకోహరమ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడి ఉంటుందని స్థానిక మీడియాకు వివరించారు. రెండు రోజుల కిందట నైజీరియాలో జరిగిన మహిళల ఆత్మాహుతి దాడుల్లో 57 మందికి పైగా మృతిచెందగా, 177 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బొకోహరమ్ ఉగ్రసంస్థ గత ఏడేళ్ల కాలంలో 20 వేలకు పైగా పౌరులను పొట్టనపెట్టుకుంది. 26 లక్షల మంది ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. -
22 మంది ఉగ్రవాదులు హతం
లాగోస్: బోకోహారమ్ ఉగ్రవాదులపై నైజీరియన్ ఆర్మీ విరుచుకుపడింది. బోర్నో రాష్ట్రంలో జరిపిన సైనిక ఆపరేషన్‌లో 22 మంది బోకోహారమ్ ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ అధికారి కల్నల్ సాని ఉస్మాన్ వెల్లడించారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు సైనికులు కూడా మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని ఆయన వెల్లడించారు. లోగోమని ప్రాంతంలో రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లతో విరుచుకుపడిన బోకోహారమ్ ఉగ్రవాదులపై సైన్యం దాడి జరపడంతో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనలో ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్స్ తో పాటు భారీ మొత్తంలో గ్రెనేడ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. -
2 గ్రామాలపై కాల్పులు: 30 మంది మృతి
అబుజా: బోకోహరామ్ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై విచాక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో 30 మంది మృతిచెందారు. అయితే, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ దాడుల విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర నైజీరియాలోని మారుమూల గ్రామాలైన యకారీ, కచీఫా గ్రామాల్లోకి మిలిటెంట్లు బైక్, వ్యాన్లలో వచ్చారు. వెంటనే గన్లతో విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 30 మంది గ్రామస్తులు మృతి చెందారు. నైజీరియా మిలిటరీకి సహాయం చేస్తున్న కారణంగా ఆ రెండు గ్రామాల ప్రజలపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారని ఓ బాధితుడు వివరించాడు. -
మళ్లీ రెచ్చిపోయిన బొకోహరాం
- ఈశాన్య నైజీరియాలోని మూడు గ్రామాల్లో ఊచకోత - 30 మంది హతం, 20 మందికి గాయాలు, ఇళ్ల కాల్చివేత కానో: పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో బొకోహరాం ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. మూడు గ్రామాలపై దాడిచేసి 30 మంది అమాయకపౌరులను పాశవికంగా చంపేశారు. మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో మిగతా గ్రామస్తులు ప్రాణభయంతో ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ఆతర్వాత ఉగ్రవాదులు ఇళ్లను తగలబెట్టి వెళ్లిపోయారు. శనివారం చోటుచేసుకున్న ఈ మారణహోమం వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య నైజీరియా రాష్ట్రం బురా షికాలోని వర్వారా, మంగారి, బురాషికా గ్రామాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఉగ్రమూకలు.. దొరికినవాళ్లను దొరికినట్లు పెద్దపెద్ద తల్వార్లతో గొంతులు కోశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకపోవడం వల్లే ఈ సంఘటన గురించి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసిందని బొకోహరాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న పౌరులు చెప్పుకొచ్చారు. గత గురువారం చోటుచేసుకున్న మరో సంఘటనలో కమూవా గ్రామానికి చెందిన 14 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. 2009తో అంతర్యుద్ధం మొదలైనప్పటినుంచి బొకోహరాం ఉగ్రవాదులు 17వేల మందిని ఊచకోతకోశారు. -
మరోసారి రెచ్చిపోయిన బొకో హారమ్
నైజీరియా: ఉగ్రవాద సంస్థ బొకో హారమ్ మరోసారి రెచ్చిపోయింది. నైజీరియాలోని ఓ మార్కెట్ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించడంతో అక్కడ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ ఈ ప్రాంతంలో పర్యటించిన నాలుగు రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఓ మహిళా ఉగ్రవాది కూడా ఈ బాంబుదాడికి ముందు తనను తాను పేల్చేసుకున్నట్లు సమాచారం. చనిపోయినవారిలో యువకులే అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బుహారీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1000మందికి పైగా అమాయకులు బలయ్యారు. బుహారీ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బొకో హారమ్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు గత ఆరునెలలుగా కృషి చేయడంతోపాటు ఉగ్రవాద వ్యతిరేక సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. -
ఉగ్రవాదులను ఉరికించి.. బందీలను విడిపించి..
అబుజా: నైజీరియా సైన్యాలు గొప్ప సాహసం చేశాయి. బొకోహారమ్ ఉగ్రవాదుల చెర నుంచి దాదాపు 61మంది బందీలను విడిపించాయి. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టాయి. చెర నుంచి విముక్తి అయినవారిలో మహిళలు, చిన్నపిల్లలు మాత్రమే అధికంగా ఉన్నారు. నైజీరియా సైన్యం యుద్ధ విమానాల ద్వారా ఈ చర్యను చేపట్టింది. ముందుగా ఆ జిహాదిస్టులు ఉన్న ప్రాంతాలను గుర్తించిన సైన్యం బందీలకు ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తగా దాడులు నిర్వహించింది. అనంతరం ఆ ప్రాంతంలో దిగి నలుగురు ఉగ్రవాదులను హతం చేసింది. అక్కడే ఉన్న మరికొందరు ఉగ్రవాదులు పారిపోగా 61మందికి విముక్తి లభించినట్లయింది. ఇటీవల బొకో హారమ్ ఉగ్రవాదుల విషయంలో నైజీరియా బలగాలు తరుచుగా పై చేయి సాధిస్తున్నారు. గత అక్టోబర్ 28న కూడా 330 మంది బందీలను విముక్తి చేశారు. వీరిలో కూడా మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. బొకోహారమ్ ఉగ్రవాదులు ఎప్పుడు మహిళలను చిన్నారులను ఎక్కువగా ఎత్తుకెళుతుంటారు. -
మసీదులో ఆత్మాహుతి దాడులు: 14 మంది మృతి
నైజీరియాలోని మైదుగురి నగర శివార్లలో ఉన్న ఓ మసీదులో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 14 మంది మరణించారు. వీళ్లలో ప్రార్థనలకు వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు మసీదులోకి చొరబడి తమను తాము పేల్చేసుకోవడంతో చాలామంది గాయపడ్డారు. తాము కట్టుకుని వచ్చిన ఐఈడీలను పేల్చేసుకున్నారు. దాంతో మసీదు భవనం కూడా కూలిపోయింది. 14 మంది మృతుల్లో ఈ ఇద్దరు బాంబర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినవారిని యూనివర్సిటీ ఆఫ్ మైదుగురి టెక్నికల్ ఆస్పత్రికి, ఇతర ఆస్పత్రులకు తరలించారు. పేలుడు సంభవించిన వెంటనే భద్రతాదళాలు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఈ వారంలోనే ఇది రెండో దాడి. ఇంతకుముందు వేరే ప్రాంతంలో జరిగిన దాడిలో 8 మంది మరణించారు. ఈ రెండు దాడులు చేసింది బోకో హరామ్ ఉగ్రవాదులేనని భావిస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రభుత్వంపై పోరాడుతున్న ఈ ఉగ్రవాద గ్రూపు నైజీరియా రాజధానిలోని ఉత్తర ప్రాంతంలో వరుసపెట్టి బాంబుదాడులకు తెగబడుతోంది. డిసెంబర్ నాటికల్లా బోకోహరాం ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచేయాలని నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ సైన్యాన్ని ఆదేశించారు. -
మూడు నెలల్లో బొకోహరాం కథ ముగించేస్తాం
అబుజా: పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ 13 ఏళ్ల క్రితం పురుడుపోసుకుని.. ఆపై వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకున్న బొకోహరాం.. ఇప్పటివరకు 10 మందిని పొట్టనబెట్టుకుంది. లక్షలాదిమంది నీడలేకుండా చేసింది. ప్రస్తుతం ఐఎస్ఐఎస్ తో చేతులు కలిపి తన పరిధిని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో నరహంతక బొకోహరాంను సమూలంగా మట్టుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది నైజీరియా ప్రభుత్వం. ఈ మేరకు బొకోహరాంను అంతమొందించాలంటూ బుధవారం నైజీరియా సైన్యాన్ని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఆదేశించారు. ' బొకోహరాం కథను ముగించానే నిర్ణయానికి వచ్చాం. మూడు నెలల్లో బొకోహరాం అనే సంస్థను భూమ్మీద లేకుండా చేస్తాం' అని బుహారీ ప్రకటించారు. బోకోతో పోరు ఎలా కొనసాగించాలనేదానిపై జాతీయ భద్రతా సలహాదారు రిటైర్డ్ మేజర్ జనరల్ బబగానా ముంగునోతో ఆయన సమావేశమయ్యారు. ఈ పోరాటంలో సహకరించాలని పొరుగుదేశాలు చాద్, నైగర్, కామెరూన్ దేశాలకు విజ్ఙప్తి చేశారు. -
మసీదులో మగాళ్లను.. ఇళ్లల్లో ఆడాళ్లను..
మైదుగురి: పవిత్ర రంజాన్ మాసం.. అందునా ప్రార్థనా సమయం కావడఅక్కడి మసీదులన్నీ కిక్కిరి పోయాయి. పొద్దంతా ఉపవాసం ఉండి ఆకలితో ఇంటికిరాబోతున్న భర్తలు, పిల్లల కోసం ఇళ్లల్లో మహిళలు వంటకు పునుకున్నారు. అంతలోనే భీకరంగా మొదలయ్యాయి.. అత్యాధునిక తుపాకుల చప్పుళ్ళు. చిన్నాపెద్దా తేడాలేదు. తుపాకికి అందినవాళ్లను అందినట్లే అనంతలోకానికి పంపేశారు. అదే సమయంలో ఇంకొద్దిమంది ఇళ్లల్లోకి చొరబడి వంటచేస్తోన్న మహిళలను కాల్చిచంపారు. ఇళ్లను తగలబెట్టారు. ఇదీ ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలోని మూడు మారుమూల గ్రామాల్లో బోకోహరాం తీవ్రవాదులు సృష్టించిన నరమేధం. గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ తీవ్రవాద దాడుల్లో 150 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత మేలో అధ్యక్షుడిగా మహమ్మద్ బుహారీ పగ్గాలు చేపట్టిన తర్వాత నైజీరియాలో చోటుచేసుకున్న అతిపెద్ద సామూహిక మారణకాండ ఇదే. అత్యాధునిక ఆయుధాలతో మోటారు సైకిళ్లపై వచ్చిన తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. -
బస్తానిండా బాంబులు.. పేలి 63 మంది మృతి
బౌచీ(నైజీరియా): భారీ సంఖ్యలో నాటు బాంబులు ఉన్న గోనెసంచి పేలిపోయి 63 మంది మృత్యువాత పడ్డారు. ఒకప్పుడు బొకోహారమ్ ఉగ్రవాదులు నివాసం ఉన్న క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అతిపెద్ద బాంబు దాడులను మించిన స్థాయిలో ఓ దాడిలాగా ఇది జరిగింది. అత్యంత భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. అధికారుల సమాచారం మేరకు ఈశాన్య నైజీరియాలోని మోంగునో పట్టణానికి సమీపంలో బొకో హారమ్ ఉగ్రవాదులు గతంలో ఉన్న స్థావరం వద్ద కొన్ని వస్తువులతో నిండిన సంచిని గుర్తించారు. వీరంతా కూడా ఆత్మరక్షణ దళ పౌరులు. ఆ సంచిని తీసుకొని వెళ్లి అంతా ఒకచోట గుమి కూడా ఆ వస్తువులు ఏమై ఉంటాయా అని చూస్తుండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో అన్ని బాంబులు పేలిపోయాయి. దీంతో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. 63 మంది మృత్యువాత పడ్డారు. పలువురు అంగవైకల్యానికి గురయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. -
ఆత్మాహుతి దాడి..11 మంది మృతి
అబుజా: నైజిరియాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన మానవబాంబు దాడిలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ దాడిని చూసి ఒక్కసారిగా ప్రభుత్వ బలగాలు ఉలిక్కిపడ్డాయి. బోకో హారానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మానవ బాంబులుగా తయారై వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారుల ప్రాథమిక సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరు సివిల్ సెక్యూరిటీ గ్రూప్ కార్యాలయంపై దాడి చేయగా మరొకరు పబ్‌లోకి వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. అబూబకర్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ దాడులపై మాట్లాడుతూ వారు ఒంటి చుట్టూ వైర్లు చుట్టుకొని పెద్దగా కేకలు వేస్తూ ఒకేసారి పక్కపక్కనే ఉన్న కార్యాలయం, పబ్‌లోకి ప్రవేశించి తమను తాము పేల్చేసుకున్నారని తెలిపాడు. స్థానిక ప్రజలపై ఎలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా సివిల్ సెక్యూరిటీ గ్రూప్ కార్యాలయం కాపాడుతుంది. ఈ నేపథ్యంలోనే వారు దానినే ప్రధాన లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. -
నైజీరియా ఇళ్లల్లో, వీధుల్లో వందల శవాలు
నైజీరియా: ఉగ్రవాదుల దాడుల కారణంగా నైజీరియా మరోసారి శవాల దిబ్బగా కనిపించింది. ఈశాన్య నైజీరియాలోని డెమాసక్ నగరంలో వందల శవాలు కుళ్లిపోయిన స్ధితిలో బయటపడ్డాయి. వీధుల వెంట, ఇళ్లలో, డెమాసక్ నదిలో అవి పేరుకుపోయి కనిపించాయి. బోకో హారమ్కు చెందిన ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ మాట్లాడుతూ ఇస్లామిస్టుల పేరు చెప్పుకుని దాడులకు పాల్పడే బోకో హారమ్ గ్రూపంతా బోగస్ గ్రూపని మండిపడ్డారు. వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పారు. వారు తీవ్రవాదులుగా తాము గుర్తించినందునే ఒక తీవ్రవాదిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటివే తీసుకుంటున్నామని చెప్పారు. డెమాసక్ నది వెంట ఉన్న ప్రాంతాన్ని బోకో హారమ్ తీవ్రవాదులు ఆక్రమించుకోగా వారిని నిలువరించేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో దాదాపు 400 మంది చనిపోయారు. వీరిలో ఉగ్రవాదులు, సామాన్యలు ఉన్నారు. చనిపోయినవారిలో పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరందరికి పెద్ద పెద్ద గుంటలు తీసి అందులో దొర్లించి సమాధి చేశారు. -
219మంది అమ్మాయిలను ఎత్తుకెళ్తే ఏం చేశారు?
లండన్: ప్రపంచ నాయకులపై నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్షర సాహసి మలాలా యూసఫ్‌జాయ్ అసహనం వ్యక్తం చేసింది. బోకోహారమ్ ఉగ్రవాదులు 219 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోయి ఏడాది అవుతున్నా మీరంతా ఏం చేస్తున్నారని నైజీరియన్ నేతలను, ఇతర ప్రపంచ నేతలను నిలదీసింది. పాకిస్థాన్‌లో బాలికల విద్యకోసం ఉద్యమించి ఉగ్రవాదుల బుల్లెట్ దాడులనుంచి ప్రాణాలతో బయటపడిన మలాలా గతేడాది నోబెల్ శాంతిపురస్కారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో బాలికలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలపై నిత్యం తాను స్పందిస్తూనే ఉంటానని చెప్పిన మలాలా.. బోకోహారమ్ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రపంచ అగ్ర నేతలకు లండన్ నుంచి బహిరంగ లేఖ రాసింది. 'ఇప్పటివరకు మిమ్మల్ని రక్షించేందుకు నైజీరియాతో సహా ప్రపంచ నేతలు కూడా ప్రయత్నించలేదు. మీ సంకెళ్లు వీడలేదు. నాయకులు మిమ్మల్ని విడిపించేందుకు ఎంతో చేయాల్సి ఉంది. వారిపై ఒత్తిడి తెచ్చేవారిలో నేను ఒకదాన్ని. ధీరబాలికలారా మీరంతా ధైర్యంగా ఉండండి. మీపై నేను ఎంతో ప్రేమతో, సానుభూతితో ఉన్నాను' అని లేఖలో పేర్కొంది. అదే సమయంలో వారిని విడిపించేందుకు కృషిచేయాలని ప్రపంచ నేతలను కోరింది. గత ఏడాది నైజీరియా నుంచి 219 మంది పాఠశాల విద్యార్థినులను బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. -
192 మంది బందీలు విడుదల
నైజీరియా: బోకో హరామ్ తీవ్రవాదుల అపహరించిన వారిలో దాదాపు 192 మంది బందీలను విడుదల చేశారని నైజీరియా సైనిక ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. విడుదలైన వారిలో అత్యధుకులు మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. తీవ్రవాదులు రెండు ట్రక్కుల్లో బందీలను డమత్తురు సమీపంలోని గిర్భువా గ్రామంలో వారిని విడిచిపెట్టారని పేర్కొన్నారు. జనవరి మొదటి వారంలో నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని యొబో గ్రామం నుంచి 218 మందిని బోకో హరామ్ తీవ్రవాదులు అపహరించారు. అయితే ఈ కిడ్నాపులకు ముందు బోకో హరాం తీవ్రవాదులు సాయుధులై కట్రాకో గ్రామంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం గ్రామంలోని మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేశారు. -
ఉపప్రధాని భార్యను అపహరించిన ఉగ్రవాదులు
బోకో హరామ్ ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతున్నారు. సొంత దేశం నైజీరియాలోనే కాదు, పొరుగున ఉన్న కామెరూన్ లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చి మరీ కామెరూన్ లోని కోలోఫాటా నగరంపై దాడి చేశారు. చేయడమే కాదు ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదౌ అలీ భార్యను, నగర మేయర్ ను, మరి కొంత మందిని అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు తమ దేశంలోని తమ రహస్య స్థావరాలకు వీరిని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కామెరూన్ ప్రస్తుతం తన సైన్యాలను సరిహద్దు వెంబడి మొహరించింది. ఇప్పటికే నైజీరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు పొరుగు దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. బోకో హరామ్ ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి అల్ కాయిదాతో సంబంధాలున్నాయి. పాశ్చత్య విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా బోకో హరామ్ పోరాడుతోంది. ఇప్పటికే నైజీరియాలోని 200 మందికి పైగా విద్యార్థినులను బోకో హరాం ఉగ్రవాదులు అపహరించుకుపోయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. -
నైజీరియన్ డ్రగ్స్ ముఠాకు దావూద్ తో సంబంధాలు?
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నైజీరియన్ డ్రగ్స్ కార్యకలాపాల వెనుక దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్ హస్తముందా? ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా అనుబంధ సంస్థలకు, నైజీరియన్ డ్రగ్ ముటాల కార్యకలాపాల మధ్య సంబంధాలున్నాయా? అవుననే అంటున్నాయి ఇంటలిజెన్స్ వర్గాలు. మన దేశంలో బెంగుళూరు, హైదరాబాద్, పుణెల వంటి మహానగరాల్లో నైజీరియన్ డ్రగ్ ముఠాలు యాక్టివ్ గా ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది పట్టుబడ్డారు కూడా. అయితే వీరందరికీ అల్ కాయిదా అనుబంధ సంస్థ, నైజీరియాలో వందలాది మంది బాలికలను కిడ్నాప్ చేసిన బోకో హరామ్ కి సన్నిహిత సంబంధాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. బోకోహరామ్ దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్ తో చేతులు కలిపి పనిచేస్తోందని, డి గ్యాంగ్ నుంచే వీరికి మాదక ద్రవ్యాలు అందుతున్నాయని వారు భావిస్తున్నారు. గత ఏడాదిలో మన దేశంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ 40 మంది నైజీరియన్లు పట్టుబడ్డారు. వీరిలో ఒక్కరు మినహా మిగతావారెవరికీ భారత్ లో ఉండేందుకు కావలసిన పత్రాలు లేవు. దేశంలో 2500 మంది నైజీరియన్లు అక్రమంగా నివసిస్తున్నారని, వీరిలో కనీసం 1500 మంది డ్రగ్స్ వ్యాపారంతో సంబంధాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలోనూ నైజీరియన్లు పట్టుబడ్డ అనేక కేసులున్నాయి. వీరిలో కొందరు సినిమా రంగంలోని వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు కూడా. -
నైజీరియాలోనూ ఒక పూనమ్ పాండే ఉందండోయ్!
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బీడీ కాల్చుకునేందుకు బోలెడంత నిప్పు దొరికిందన్నాడట ఒకడు. సరిగ్గా అలాంటి పనే చేసింది ఓ నైజీరియన్ పాప్ సింగర్. ప్రస్తుతం నైజీరియాలో అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేసింది. ఇది ఏప్రిల్ 14 న జరిగింది. ఆడపిల్లలు చదువుకోవడం మత విరుద్ధమన్నదే బోకోహరామ్ వాదన. అయితే బందీలుగా ఉన్న ఆ విద్యార్థినుల కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ సంక్షోభం సాయంతో సులువుగా ప్రచారం పొందవచ్చుననుకుంది నైజీరియన్ పాప్ సింగర్ అడోకియే. 'ఉగ్రవాదులారా... ఆ పిల్లల్ని వదిలిపెట్టండి. మీకు కావాలంటే నన్ను తీసుకెళ్లండి. నా కన్యత్వం మీకు సమర్పించుకుంటా' అని ఓ ఆఫర్ ఇచ్చేసింది. 'వారంతా చిన్నపిల్లలు, నాకు అనుభవం ఉంది. నన్ను రోజుకు 12 మంది అనుభవించినా నాకు పరవాలేదు' అని పేర్కొంది ఆ అమ్మడు. బోకో హరామ్ అడోకియే ఆఫర్ ని తీసుకున్నా తీసుకోకపోయినా అమ్మడికి మాత్రం బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. -
'బొకో హరామ్' దాడుల్లో 85మంది మృతి
అబుజా : నైజీరియా ఈశాన్య ప్రాంతంలో గత అయిదు రోజుల్లో 'బొకో హరామ్' అనే ముస్లిం ఉగ్రవాద సంస్థ దాడుల్లో 87మంది దుర్మరణం చెందారు. వారిలో 47మంది విద్యార్థులు ఉన్నారు. యోబ్ రాష్ట్రంలోని గజ్బాలోని వ్యవసాయ కళాశాలపై ఆదివారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 50కిపైగా విద్యార్థులు మరణించారు. మరణించినవారిలో 18-22 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ఉన్నారు. భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు.. హస్టల్లోకి చొరబడి నిద్రిస్తున్న విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు కొందరు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం విని మిగతా విద్యార్థులు పారిపోవడానికి ప్రయత్నించారు. మిలిటెంట్లు వెంటాడి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ హస్టల్‌కు నిప్పు పెట్టారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. బోకో హరమ్ అనే ఇస్లామిక్ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
నైజీరియాలో తీవ్రవాదుల దాడి: 50 మంది విద్యార్థుల మృతి
దాముతూరు: నైజీరియాలో ఆదివారం రక్తం ఏరులై పారింది. అకస్మికంగా తీవ్రవాదులు చేసిన దాడిలో 50 మంది విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు కాలేజీ క్యాంపస్ బయట ఉన్నప్పుడు నిషేధిత బోకో హారమ్ తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో 50 మంది పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ దాముతురుకు అతి సమీపంలోని గుజ్గా నగరంలో ఉన్న ఓ వ్యవసాయ కాలేజీపై దుండగులు కాల్పులకు దిగారు. అకస్మికంగా జరిగిన ఈ ఘటన నుంచి తేరుకునే లోపే చాలా మంది ప్రాణాలు కోల్పోక తప్పలేదు. పొదల్లోనూ, క్యాంపస్ బయట చెల్ల చెదురుగా పడి ఉన్న మృత దేహాలను అధికారులు కనుగొన్నారు. గత జూలై ఆరవ తేదీన నిషేధిత బోకో హారమ్ తీవ్రవాదులు దాడులు మరువముందే తాజాగా ఈ ఘటన కలకలం రేపింది. అప్పటి తీవ్రవాదులు దాడిలో ఒక టీచర్ తో 29 మంది మృత్యువాత పడ్డారు.