మూడు నెలల్లో బొకోహరాం కథ ముగించేస్తాం
అబుజా: పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ 13 ఏళ్ల క్రితం పురుడుపోసుకుని.. ఆపై వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకున్న బొకోహరాం.. ఇప్పటివరకు 10 మందిని పొట్టనబెట్టుకుంది. లక్షలాదిమంది నీడలేకుండా చేసింది. ప్రస్తుతం ఐఎస్ఐఎస్ తో చేతులు కలిపి తన పరిధిని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో నరహంతక బొకోహరాంను సమూలంగా మట్టుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది నైజీరియా ప్రభుత్వం.
ఈ మేరకు బొకోహరాంను అంతమొందించాలంటూ బుధవారం నైజీరియా సైన్యాన్ని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఆదేశించారు. ' బొకోహరాం కథను ముగించానే నిర్ణయానికి వచ్చాం. మూడు నెలల్లో బొకోహరాం అనే సంస్థను భూమ్మీద లేకుండా చేస్తాం' అని బుహారీ ప్రకటించారు. బోకోతో పోరు ఎలా కొనసాగించాలనేదానిపై జాతీయ భద్రతా సలహాదారు రిటైర్డ్ మేజర్ జనరల్ బబగానా ముంగునోతో ఆయన సమావేశమయ్యారు. ఈ పోరాటంలో సహకరించాలని పొరుగుదేశాలు చాద్, నైగర్, కామెరూన్ దేశాలకు విజ్ఙప్తి చేశారు.