బాలికలు బాంబులు పేల్చుకుని విధ్వంసం!
మైదుగురి: రెండు రోజుల కిందట తరహాలోనే మరో ఇద్దరు బాలికలు విధ్వంసం సృష్టించారు. దీంతో కొందరు సైనికులు కూడా మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నైజీరియాలోని మైదుగురి నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. విక్టర్ ఐసుకు అనే పోలీస్ అధికారి కథనం ప్రకారం.. నైజీరియా వాయవ్యప్రాంతంలో ఉన్న మైదుగురి సిటీ మార్కెట్లో అప్పటివరకూ అంతా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు గుర్తుతెలియని పదేళ్లలోపు వయసున్న బాలికలు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేపింది. ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదన్నారు.
మొదట మార్కెట్లో ఓ బాలిక ఆత్మాహుతి దాడికి పాల్పడగా కొన్ని సెకన్లలోనే మరో బాలిక విధ్వంసానికి పాల్పడిందని విక్టర్ ఐసుకు అనే పోలీసు తెలిపాడు. బొకోహరమ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడి ఉంటుందని స్థానిక మీడియాకు వివరించారు. రెండు రోజుల కిందట నైజీరియాలో జరిగిన మహిళల ఆత్మాహుతి దాడుల్లో 57 మందికి పైగా మృతిచెందగా, 177 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బొకోహరమ్ ఉగ్రసంస్థ గత ఏడేళ్ల కాలంలో 20 వేలకు పైగా పౌరులను పొట్టనపెట్టుకుంది. 26 లక్షల మంది ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లారు.