ఉపప్రధాని భార్యను అపహరించిన ఉగ్రవాదులు
Published Mon, Jul 28 2014 2:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
బోకో హరామ్ ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతున్నారు. సొంత దేశం నైజీరియాలోనే కాదు, పొరుగున ఉన్న కామెరూన్ లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చి మరీ కామెరూన్ లోని కోలోఫాటా నగరంపై దాడి చేశారు. చేయడమే కాదు ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదౌ అలీ భార్యను, నగర మేయర్ ను, మరి కొంత మందిని అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు తమ దేశంలోని తమ రహస్య స్థావరాలకు వీరిని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.
కామెరూన్ ప్రస్తుతం తన సైన్యాలను సరిహద్దు వెంబడి మొహరించింది. ఇప్పటికే నైజీరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు పొరుగు దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. బోకో హరామ్ ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి అల్ కాయిదాతో సంబంధాలున్నాయి. పాశ్చత్య విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా బోకో హరామ్ పోరాడుతోంది. ఇప్పటికే నైజీరియాలోని 200 మందికి పైగా విద్యార్థినులను బోకో హరాం ఉగ్రవాదులు అపహరించుకుపోయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
Advertisement