82 మంది విద్యార్థినులకు విముక్తి
అబుజా: ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా నైజీరియాలోని ఉగ్రవాద సంస్థ బొకోహరమ్ చెర నుంచి మరో 82 మంది ‘చిబోక్’ విద్యార్థినులు విడుదలయ్యారు. వారు దేశాధ్యక్షుడు మహమ్మద్ బుహారీని కలవనున్నారు. 2014 ఏప్రిల్ 14న బొకోహరమ్ ఉగ్రవాదులు చిబోక్ పట్టణంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై దాడి చేసి 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేశారు. అనంతరం 57 మంది తప్పించుకోగా, 219 మంది బందీలుగా మిగిలిపోయారు. వారిని ఇస్లాంలోకి మార్పించినట్లు అనంతరం బొకోహరమ్ వీడియో సందేశంలో పేర్కొంది.
చర్చల ఫలితంగా గత అక్టోబర్‌లో 21 మంది బాలికలు ఉగ్రవాదుల చెర నుంచి విడుదలయ్యారు. ఆరు నెలల అనంతరం మరో 82 మంది విద్యార్థినులు విడుదలై నట్లు అధ్యక్ష భవనం తెలిపింది. అయితే ఇందుకుగాను ఎంతమంది ఉగ్రవాదులను విడుదల చేయనున్నారో మాత్రం వెల్లడించలేదు.