219మంది అమ్మాయిలను ఎత్తుకెళ్తే ఏం చేశారు?
లండన్: ప్రపంచ నాయకులపై నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్షర సాహసి మలాలా యూసఫ్జాయ్ అసహనం వ్యక్తం చేసింది. బోకోహారమ్ ఉగ్రవాదులు 219 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోయి ఏడాది అవుతున్నా మీరంతా ఏం చేస్తున్నారని నైజీరియన్ నేతలను, ఇతర ప్రపంచ నేతలను నిలదీసింది. పాకిస్థాన్లో బాలికల విద్యకోసం ఉద్యమించి ఉగ్రవాదుల బుల్లెట్ దాడులనుంచి ప్రాణాలతో బయటపడిన మలాలా గతేడాది నోబెల్ శాంతిపురస్కారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో బాలికలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలపై నిత్యం తాను స్పందిస్తూనే ఉంటానని చెప్పిన మలాలా.. బోకోహారమ్ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రపంచ అగ్ర నేతలకు లండన్ నుంచి బహిరంగ లేఖ రాసింది.
'ఇప్పటివరకు మిమ్మల్ని రక్షించేందుకు నైజీరియాతో సహా ప్రపంచ నేతలు కూడా ప్రయత్నించలేదు. మీ సంకెళ్లు వీడలేదు. నాయకులు మిమ్మల్ని విడిపించేందుకు ఎంతో చేయాల్సి ఉంది. వారిపై ఒత్తిడి తెచ్చేవారిలో నేను ఒకదాన్ని. ధీరబాలికలారా మీరంతా ధైర్యంగా ఉండండి. మీపై నేను ఎంతో ప్రేమతో, సానుభూతితో ఉన్నాను' అని లేఖలో పేర్కొంది. అదే సమయంలో వారిని విడిపించేందుకు కృషిచేయాలని ప్రపంచ నేతలను కోరింది. గత ఏడాది నైజీరియా నుంచి 219 మంది పాఠశాల విద్యార్థినులను బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.