దాముతూరు: నైజీరియాలో ఆదివారం రక్తం ఏరులై పారింది. అకస్మికంగా తీవ్రవాదులు చేసిన దాడిలో 50 మంది విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు కాలేజీ క్యాంపస్ బయట ఉన్నప్పుడు నిషేధిత బోకో హారమ్ తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో 50 మంది పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
దక్షిణ దాముతురుకు అతి సమీపంలోని గుజ్గా నగరంలో ఉన్న ఓ వ్యవసాయ కాలేజీపై దుండగులు కాల్పులకు దిగారు. అకస్మికంగా జరిగిన ఈ ఘటన నుంచి తేరుకునే లోపే చాలా మంది ప్రాణాలు కోల్పోక తప్పలేదు. పొదల్లోనూ, క్యాంపస్ బయట చెల్ల చెదురుగా పడి ఉన్న మృత దేహాలను అధికారులు కనుగొన్నారు. గత జూలై ఆరవ తేదీన నిషేధిత బోకో హారమ్ తీవ్రవాదులు దాడులు మరువముందే తాజాగా ఈ ఘటన కలకలం రేపింది. అప్పటి తీవ్రవాదులు దాడిలో ఒక టీచర్ తో 29 మంది మృత్యువాత పడ్డారు.