
ఘటనా స్థలంలోని దృశ్యం
ఉగ్రవాదుల మారణహోమంతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడింది. అదను చూసి కాల్పులు, బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు.. చెల్లాచెదురైన మృతదేహాలే ఎటు చూసినా కనిపించాయి.
నైజీరియాలో ఓ చర్చిలో జరిగిన ఉగ్రకాండలో యాభై మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది.
దాడిని చాలా పక్కగా నిర్వహించారు ఉగ్రవాదులు. కొందరు చర్చిలోపల కాల్పులకు పాల్పడగా.. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్లపై బయట ఉన్న మరో ఉగ్రవాది తూటాల వర్షం కురిపించాడు. మృతదేహాలు, చెల్లాచెదురుగా విడిభాగాలతో చర్చి భీతావహంగా ఉంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయినట్టు నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాదుల పనిగా భావిస్తున్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. పలు దేశాల అధినేతలు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
చదవండి: బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం
Comments
Please login to add a commentAdd a comment