T20 WC 2025 USA vs Ire: ధనాధన్‌.. 9.4 ఓవర్లలోనే.. | ICC U19 Women T20 WC 2025: USA Beat Ireland By 9 Wickets 1st Win | Sakshi
Sakshi News home page

T20 WC 2025: ధనాధన్‌.. 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసిన అమెరికా

Published Tue, Jan 21 2025 10:22 AM | Last Updated on Tue, Jan 21 2025 11:08 AM

ICC U19 Women T20 WC 2025: USA Beat Ireland By 9 Wickets 1st Win

ఐసీసీ మహిళల అండర్‌–19 టి20 ప్రపంచకప్‌-2025(ICC Under 19 Womens T20 World Cup 2025)లో అమెరికా తొలి గెలుపు నమోదు చేసింది. అమెరికా యువతుల జట్టు ఐర్లాండ్‌(Ireland Women U19 vs USA Women U19)పై మెరిక విజయం సాధించింది. 

కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.  జొహూర్‌ బహ్రూ వేదికగా సోమవారం జరిగిన ఈ ‘సూపర్‌ షో’ టోర్నీకే వన్నె తెచ్చింది. 

75 పరుగులకే ఆలౌట్‌
ముందుగా ఐర్లాండ్‌ 17.4 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అలైస్‌ వాల్ష్‌ (16; 2 ఫోర్లు), లాలా మెక్‌బ్రిడ్‌ (13), అబీ హ్యారిసన్‌ (13), ఫ్రెయా సర్జెంట్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు.

ఇసాని వాఘెలా 3, అదితిబా, రీతూ సింగ్, చేతన ప్రసాద్‌ తలా 2 వికెట్లు తీశారు. తెలుగు సంతతి అమ్మాయి ఇమ్మడి శాన్వీ ఒక వికెట్‌ తీసింది. తర్వాత అమెరికా జట్టు 9.4 ఓవర్లలోనే వికెట్‌ మాత్రమే కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. 

ఓపెనర్లు దిశా ఢీంగ్రా (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తెలుగు సంతతి అమ్మాయి పగిడ్యాల చేతన రెడ్డి (25 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. 

ఆ మరుసటి బంతికే ఇసాని వాఘేలా (4 నాటౌట్‌) బౌండరీ బాదడంతో ఇంకా 10.2 ఓవర్లు మిగిలుండగానే అమెరికా అమోఘ విజయం సాధించింది. ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో శ్రీలంకతో వెస్టిండీస్‌ (ఉదయం 8 గంటల నుంచి), మలేసియాతో భారత్‌ (మధ్యాహ్నం 12 గంటల నుంచి) తలపడతాయి.

సంచలన విజయం
ఈ మెగా టోర్నీతోనే వరల్డ్‌కప్‌లో అరంగేట్రం చేసిన ఆఫ్రికా దేశం నైజీరియా యువతుల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన పోరులో నైజీరియా... న్యూజిలాండ్‌కు ఊహించని షాక్‌ ఇచ్చింది. 

మహిళల క్రికెట్‌లో కివీస్‌ బలమైన జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు ఏమాత్రం తీసిపోని గట్టి ప్రత్యర్థి. అలాంటి జట్టును తాము నిర్దేశించిన 66 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించకుండా నిలువరించడం పెద్ద విశేషం.

గ్రూప్‌ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నైజీరియా నిర్ణీత 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్‌ లక్కీ పియెటి (25 బంతుల్లో 19; 1 ఫోర్‌) టాప్‌స్కోరర్‌ కాగా, లిలియన్‌ ఉడే (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) రెండంకెల స్కోరు చేసింది.

ఇతరుల్లో ఇంకెవరూ కనీసం పది పరుగులైనా చేయలేదు. తర్వాత స్వల్ప లక్ష్యమే అయినా కివీస్‌ 13 ఓవర్లలో 6 వికెట్లకు 63 పరుగులే చేసి ఓడింది. అనిక టాడ్‌ (27 బంతుల్లో 19; 1 ఫోర్‌), ఇవ్‌ వొలాండ్‌ (15 బంతుల్లో 14; 1 ఫోర్‌) మెరుగ్గా ఆడారంతే! లలియన్‌ ఉడే (3–0–8–1) బౌలింగ్‌లోనూ అదరగొట్టింది.

ఆఖరి ఓవర్‌ డ్రామా... 
కివీస్‌ 57/5 స్కోరు చేసి గెలుపు వాకిట నిలబడింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు చేస్తే చాలు. కానీ నైజీరియన్‌ బౌలర్ లక్కీ పియెటి 6 పరుగులే ఇచ్చింది. దీంతో 2 పరుగుల తేడాతో ఊహించని విధంగా న్యూజిలాండ్‌ కంగుతింది. లక్కీ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులే ఇచ్చింది. ఇందులో రెండో బంతి ‘బై’ కాగా, నాలుగో బంతి లెగ్‌బై!

అంటే బ్యాటర్లు కొట్టింది 2 పరుగులే అన్నమాట! ఐదో బంతికి పరుగే ఇవ్వలేదు. ఇక మిగిలింది. చివరి బంతి... కివీస్‌ గెలిచేందుకు 5 పరుగులు కావాలి. అయాన్‌ లంబట్‌ (6 నాటౌట్‌) కొట్టిన షాట్‌కు 2 పరుగులే రాగా, మరో పరుగుకు ప్రయతి్నంచడంతో కెప్టెన్‌ టష్‌ వేక్‌లిన్‌ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) రనౌటైంది.  

చదవండి: 10 బంతుల్లోనే ఖేల్‌ ఖతం.. టీ20 వరల్డ్‌కప్‌-2025లో సంచలనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement