నైజీరియా ఇళ్లల్లో, వీధుల్లో వందల శవాలు
నైజీరియా: ఉగ్రవాదుల దాడుల కారణంగా నైజీరియా మరోసారి శవాల దిబ్బగా కనిపించింది. ఈశాన్య నైజీరియాలోని డెమాసక్ నగరంలో వందల శవాలు కుళ్లిపోయిన స్ధితిలో బయటపడ్డాయి. వీధుల వెంట, ఇళ్లలో, డెమాసక్ నదిలో అవి పేరుకుపోయి కనిపించాయి. బోకో హారమ్కు చెందిన ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ మాట్లాడుతూ ఇస్లామిస్టుల పేరు చెప్పుకుని దాడులకు పాల్పడే బోకో హారమ్ గ్రూపంతా బోగస్ గ్రూపని మండిపడ్డారు. వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పారు.
వారు తీవ్రవాదులుగా తాము గుర్తించినందునే ఒక తీవ్రవాదిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటివే తీసుకుంటున్నామని చెప్పారు. డెమాసక్ నది వెంట ఉన్న ప్రాంతాన్ని బోకో హారమ్ తీవ్రవాదులు ఆక్రమించుకోగా వారిని నిలువరించేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో దాదాపు 400 మంది చనిపోయారు. వీరిలో ఉగ్రవాదులు, సామాన్యలు ఉన్నారు. చనిపోయినవారిలో పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరందరికి పెద్ద పెద్ద గుంటలు తీసి అందులో దొర్లించి సమాధి చేశారు.