అబుజా: బోకోహరామ్ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై విచాక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో 30 మంది మృతిచెందారు. అయితే, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ దాడుల విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర నైజీరియాలోని మారుమూల గ్రామాలైన యకారీ, కచీఫా గ్రామాల్లోకి మిలిటెంట్లు బైక్, వ్యాన్‌లలో వచ్చారు. వెంటనే గన్‌లతో విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 30 మంది గ్రామస్తులు మృతి చెందారు. నైజీరియా మిలిటరీకి సహాయం చేస్తున్న కారణంగా ఆ రెండు గ్రామాల ప్రజలపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారని ఓ బాధితుడు వివరించాడు.