
లక్ష్యం దిశగా దూసుకుపోతున్న క్షిపణులు
ప్యాంగ్‌యాంగ్/ సియోల్ : ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాలను పరీక్షించింది. ఈ పరీక్షలను ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ పరీక్షలు శనివారం నిర్వహించినట్లు తెలిపింది. దీర్ఘ శ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాల సామర్థ్యాన్ని, లక్ష్యాలను ఛేదించే కచ్చితత్వాన్ని అంచనా వేసే ఉద్దేశంతో ఈ పరీక్షలు జరిపినట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. తూర్పుతీర ప్రాంతంలో ఈ పరీక్షలు జరపడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్షలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉంది. 45 నుంచి 150 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను ఉత్తరకొరియా పరీక్షించిందని దక్షిణ కొరియా ఆదివారం వెల్లడించింది.
కాగా 2017, నవంబర్‌లో కొరియా చివరిసారిగా ఇటువంటి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. శక్తిమంతమైన బలంద్వారా మాత్రమే అసలైన శాంతి, భద్రత లభిస్తాయంటూ పరీక్షల అనంతరం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ సైన్యాన్ని ఉద్దేశించి పేర్కొనడం తెలిసిందే.ఇటువంటి సత్యాన్ని బలగాలు గుర్తెరిగి మసలాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికాపై ఒత్తిడి పెంచడమే ఉన్ ఉద్దేశమని అణ్వాయుధ విభాగం నిపుణులు అభిప్రాయపడ్డారు. నిరాయుధీకరణకు సంబంధించి అమెరికా అనుసరిస్తున్న తీరు ఇబ్బంది కలిగించిందని, ఎవరి ఒత్తిడికీ తలొగ్గే తత్వం ఆయనది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment