నార్వేలో రాతియుగంనాటి పుర్రె లభ్యం
లండన్: పురావస్తు పరిశోధకులు నార్వేలో జరుపుతున్న తవ్వకాల్లో రాతియుగానికి చెందిన ఓ మానవ పుర్రె లభ్యమైంది. అది దాదాపు 8 వేల సంవత్సరాల క్రితంనాటిదని భావిస్తున్నారు. ఓస్లో సమీపంలోని స్టొక్కేలో జరుపుతున్న తవ్వకాల్లో అది బయటపడిందని పరిశోధకులు వెల్లడించారు. ఆ పుర్రెను విశ్లేషిస్తే రాతియుగంనాటి జీవన పరిస్థితులు ఎలా ఉండేవనే అంశంపై ఏదైనా సమాచారం దొరికే అవకాశం ఉంటుందని తవ్వకాలను పర్యవేక్షిస్తున్న గౌతే రీటన్ పేర్కొన్నారు.
గత రెండు నెలల నుంచి అక్కడ పురాతత్వ తవ్వకాలు సాగుతున్నట్టు చెప్పారు. పుర్రెతోపాటు కొన్ని ఎముకలు కూడా లభించాయని, అయితే అవి మనుషులవా లేక జంతువులవా అన్న విషయం వాటిని విశ్లేషించిన తర్వాత తేలుతుందన్నారు. వాటిలో ఒక ఎముక పెద్దగా ఉందని, బహుశా అది భుజం లేదా తొడ ఎముక అయి ఉండొచ్చని రీటన్ అభిప్రాయపడ్డారు. ఇవి ఏ కాలానికి చెందినవో శాస్త్రీయంగా నిర్ధారించేందుకు నిపుణుల సహకారం అవసరమని పేర్కొన్నారు.