Human skull
-
మనిషి పుర్రెతో విమానం ఎక్కబోయి..
భోపాల్: ఓ సాధ్వీ మనిషి పుర్రె, ఎముకలు ఉన్న బ్యాగ్‌తో విమానం ఎక్కబోయి అధికారులకు దొరికిపోయింది. ఈ ఘటన ఇండోర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్వీ యోగ్‌మాతా సచ్దేవ్ అనే మహిళ.. ఉజ్జయినీ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండోర్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఈ క్రమంలో లగేజ్ స్కానింగ్ వద్ద భద్రతా సిబ్బంది ఆమె బ్యాగ్ తనిఖీ చేయగా.. అందులో పుర్రె, ఎముకలు కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు. అనంతరం సిబ్బంది ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్కి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై విచారణ జరపగా.. గంగలో నిమజ్జనం కోసం తన తోటి సన్యాసి అస్తికలను హరిద్వార్‌కు తీసుకువెళుతున్నట్లు చెప్పింది. దీంతో ఎయిర్‌పోర్టు మేనేజ్మెంట్ వాటిని తీసుకుని ప్రయాణించడం కుదరదని ఆమెను ఆపేశారు. చివరికి వాటిని వేరే సాధువులకి ఇచ్చి రోడ్డు మార్గం ద్వారా హరిద్వార్‌కు పంపి, సాధ్వీ మరొక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. చదవండి: ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
అక్కడ మానవ పుర్రెలు.. ప్రజల్లో భయం
భువనేశ్వర్: నదీ తీరాల్లో మానవ పుర్రెలు తారస పడ్డాయి. ఈ సంఘటన పట్ల స్థానికులో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాల్లో తాంత్రిక శక్తుల సాధన, ప్రయోగంతో మానవ పుర్రెలు వినియోగిస్తారు. ఈ ప్రాంతంలో పుర్రెలు తారసపడడం ఈ కార్యకలాపాలకు తార్కాణంగా పరిగణించి సాధారణ ప్రజానీకం ఆందోళన చెందుతోంది. జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్ పోలీసు స్టేషన్ పరిధి కృష్ణనందపుర గ్రామంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణనందపుర ఔట్‌పోస్టు పోలీసు అధికారి అనిరుద్ధ నాయక్ సందిగ్ధ ప్రాంతాల్ని సందర్శించి రెండు ప్రాంతాల్లో 4 పుర్రెల్ని కనుగొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. -
మానవ పుర్రెలు, అస్థిపంజరాల స్మగ్లింగ్
పట్నా : బిహార్‌లోని సరాన్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి 50 మానవ అస్థిపంజరాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడన్న అనుమానంతో అతడిని అరెస్టు చేశారు. వివరాలు... సంజయ్ ప్రసాద్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి బలియా వెళ్లే బలియా- సీల్దా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చాప్రా రైల్వే స్టేషనులో అతడి బ్యాగులను తనిఖీ చేయగా మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ మహ్మద్ తన్వీర్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకువచ్చిన ఈ అస్థిపంజరాలను చైనా గుండా భూటాన్ తరలించేందుకు సంజయ్ పథకం రచించాడని వెల్లడించారు. 16 పుర్రెలతో పాటు మరో 34 మానవ అవశేషాలను అతడు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అదే విధంగా అతడి వద్ద నేపాల్, భూటాన్ కరెన్సీలతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు లభించాయని పేర్కొన్నారు. నేపాల్, భూటాన్‌లో మానవ అస్థిపంజరాలకు భారీ డిమాండ్ ఉందని, ఈ నేపథ్యంలోనే అక్కడి వైద్య విద్యార్థులకు అమ్మేందుకే సంజయ్ ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నామన్నారు. ఇందులో అంతర్జాతీయ రాకెట్‌కు కూడా సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాగా గతంలో కూడా సారన్ జిల్లాలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. స్మగ్లర్ల నుంచి సుమారు 1000 మానవ పుర్రెలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నార్వేలో రాతియుగంనాటి పుర్రె లభ్యం
లండన్: పురావస్తు పరిశోధకులు నార్వేలో జరుపుతున్న తవ్వకాల్లో రాతియుగానికి చెందిన ఓ మానవ పుర్రె లభ్యమైంది. అది దాదాపు 8 వేల సంవత్సరాల క్రితంనాటిదని భావిస్తున్నారు. ఓస్లో సమీపంలోని స్టొక్కేలో జరుపుతున్న తవ్వకాల్లో అది బయటపడిందని పరిశోధకులు వెల్లడించారు. ఆ పుర్రెను విశ్లేషిస్తే రాతియుగంనాటి జీవన పరిస్థితులు ఎలా ఉండేవనే అంశంపై ఏదైనా సమాచారం దొరికే అవకాశం ఉంటుందని తవ్వకాలను పర్యవేక్షిస్తున్న గౌతే రీటన్ పేర్కొన్నారు. గత రెండు నెలల నుంచి అక్కడ పురాతత్వ తవ్వకాలు సాగుతున్నట్టు చెప్పారు. పుర్రెతోపాటు కొన్ని ఎముకలు కూడా లభించాయని, అయితే అవి మనుషులవా లేక జంతువులవా అన్న విషయం వాటిని విశ్లేషించిన తర్వాత తేలుతుందన్నారు. వాటిలో ఒక ఎముక పెద్దగా ఉందని, బహుశా అది భుజం లేదా తొడ ఎముక అయి ఉండొచ్చని రీటన్ అభిప్రాయపడ్డారు. ఇవి ఏ కాలానికి చెందినవో శాస్త్రీయంగా నిర్ధారించేందుకు నిపుణుల సహకారం అవసరమని పేర్కొన్నారు.