ప్రతీకాత్మక చిత్రం
పట్నా : బిహార్‌లోని సరాన్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి 50 మానవ అస్థిపంజరాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడన్న అనుమానంతో అతడిని అరెస్టు చేశారు. వివరాలు... సంజయ్ ప్రసాద్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి బలియా వెళ్లే బలియా- సీల్దా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చాప్రా రైల్వే స్టేషనులో అతడి బ్యాగులను తనిఖీ చేయగా మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ మహ్మద్ తన్వీర్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకువచ్చిన ఈ అస్థిపంజరాలను చైనా గుండా భూటాన్ తరలించేందుకు సంజయ్ పథకం రచించాడని వెల్లడించారు. 16 పుర్రెలతో పాటు మరో 34 మానవ అవశేషాలను అతడు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అదే విధంగా అతడి వద్ద నేపాల్, భూటాన్ కరెన్సీలతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు లభించాయని పేర్కొన్నారు. నేపాల్, భూటాన్‌లో మానవ అస్థిపంజరాలకు భారీ డిమాండ్ ఉందని, ఈ నేపథ్యంలోనే అక్కడి వైద్య విద్యార్థులకు అమ్మేందుకే సంజయ్ ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నామన్నారు. ఇందులో అంతర్జాతీయ రాకెట్‌కు కూడా సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
కాగా గతంలో కూడా సారన్ జిల్లాలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. స్మగ్లర్ల నుంచి సుమారు 1000 మానవ పుర్రెలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment