ముక్కుతోనే చిక్కు!
వంటలు ఘుమఘుమలాడుతుంటే ఎవరైనా రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తారు. దీంతో కొంచెం ఒళ్లు చేయడం సహజమే. అయితే మీకు వాసన పీల్చే శక్తి ఎక్కువగా ఉంటే చాలు.. మోతాదుగా ఆహారం తీసుకున్నా లావెక్కిపోతారని అంటున్నారు కాలిఫోర్నియా బర్క్‌లీ శాస్త్రవేత్తలు. ఘ్రాణశక్తి బాగా ఉన్న ఒక ఎలుకకు.. ఆ శక్తి అసలు లేని ఇంకో ఎలుకకు ఒకే రకమైన ఆహారం పెట్టారు. కొంతకాలానికి మొదటి ఎలుక బాగా లావెక్కిపోతే.. రెండోది ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. దీంతో ఘ్రాణ శక్తిలేని ఎలుకకు వాసన పీల్చే శక్తిని కృత్రిమంగా పెంచి మరోసారి ప్రయోగం చేశారు. ఫలితం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వాసన శక్తి ఎక్కువగా ఉన్న ఎలుకలు మరింత లావెక్కిపోయాయి.
దీన్ని బట్టి.. శరీరం స్వీకరించే కేలరీలతో ఏం చేయాలన్నది ఈ వాసనపై ఆధారపడి ఉంటుంది అని! వాసన రాకపోతే.. శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది.. ఎంత వాసన పసిగట్టే శక్తి ఉంటే అంత మేర ఎక్కువగా కేలరీలను శరీరంలో నిల్వ చేస్తుంది అనీ! ఇంకోలా చెప్పాలంటే.. వాసన ఎక్కువ వస్తే శరీరంలో కొవ్వు అంత ఎక్కువ పెరుగుతుందన్న మాట. జీవక్రియలను నియంత్రించే మెదడులోని హైపోథలమస్‌కూ.. వాసనలను గుర్తించే వ్యవస్థకూ మధ్య సంబంధాలు ఉండటం వల్లే ఇలా జరుగుతోందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న క్లైన్ రియారా అనే శాస్త్రవేత్త తెలిపారు. వయసు వల్ల, వ్యాధుల వల్ల, లేదా గాయాల వల్ల వాసన పీల్చే శక్తి తగ్గినప్పుడు మనం సన్నబడటానికి కారణం ఇదేనని చెబుతున్నారు.