రోజుకు 75 గ్రాములకు మించి మాంసం తినరాదు
పాఠశాలల్లో విద్యార్థుల స్థూలకాయానికి టీచర్లే బాధ్యత వహించాలంటూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన చైనా అధికార యంత్రాంగం ఇప్పుడు మరో వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసింది.
పాఠశాలల్లో విద్యార్థుల స్థూలకాయానికి టీచర్లే బాధ్యత వహించాలంటూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన చైనా అధికార యంత్రాంగం ఇప్పుడు మరో వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసింది. చైనా ప్రజలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు రోజుకు 45 -75 గ్రాముల లోపలే మాంసాహారాన్ని తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం చైనా పౌరుడు సగటున దీనికి ఇంతకన్నా రెట్టింపు మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించమని ఆదేశించింది.
చైనా ‘నేషనల్ సెంటర్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’ డైరెక్టర్ జనరల్ లీ జున్‌ఫెంగ్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను వాతావరణ పరిరక్షణ కార్యకర్తలతో పాటు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్, డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సమర్థించారు. ముఖ్యంగా గోమాంసం, గొర్రె మాంసాన్ని గణనీయంగా తగ్గించాలని తమ సంస్థ భావిస్తున్నట్లు జున్‌ఫెంగ్ తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం వల్ల చైనా పౌరుల్లో మాంసం వినియోగం 40 నుంచి 50 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రపంచం మొత్తం మీద ప్రజలు వినియోగిస్తున్న మాంసంలో 28 శాతం మాంసాన్ని ఒక్క చైనానే వినియోగించడం గమనార్హం. మాంసానికి బదులుగా శాకాహారాన్ని తీసుకోవడం వల్ల వాతావరణంపై మాంసం ఉద్గారాలు 29 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గుతాయని ఓ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. చైనాలో ఆవులు, గొర్రెల వల్ల ఏటా పదికోట్ల టన్నుల మిథేన్ గ్యాస్ కూడా విడుదలవుతుందని సర్వేలో అంచనా వేశారు.
ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అంచనాల ప్రకారం చైనాలో 2014 సంవత్సరంలో పంది మాంసం 57,171 టన్నులు, కోడి మాంసం 18,087 టన్నులు, గోమాంసం 7,242 టన్నులు, గొర్రె మాంసం 4,449 టన్నులు ఆహారంగా తీసుకున్నారు. చైనా ప్రజలు ల్యాబుల్లో తయారుచేసే కృత్రిమ మాంసానికి మళ్లితే మంచిదని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ప్రొఫెసర్ మార్క్ పోస్ట్ సూచించారు. మాంసం తినడం వల్ల వచ్చే సమస్యలేమిటో తనకు బాగా తెలుసని, అయితే తాను కూడా మాంసం తినకుండా ఉండలేనని, అందుకనే ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నానని ఆయన చెప్పారు.


