ఇక నేను ప్రశాంతంగా చనిపోతా!
సిమ్లా: అతడో వీర సైనికుడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా పోరాడుతున్న సమయంలో సహచరుల ప్రాణాలు కాపాడే క్రమంలో తాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ సాహసానికి గాను బ్రిటిష్ సామ్రాజ్యం అతడికి మరణానంతరం జార్జి క్రాస్ పురస్కారం ఇచ్చింది. అయితే అది కాస్తా 2002 సంవత్సరంలో పోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పతకం అతడి భార్య చెంతకు వస్తోంది. దాంతో.. ఆమె ''ఇక నేను హాయిగా చచ్చిపోవచ్చు'' అంటూ నిట్టూరుస్తున్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యపు పురస్కారం జార్జ్ క్రాస్ పతకాన్ని తిరిగి పొందడంపై దివంగత భారతీయ సైనికుడు నాయక్ కిర్పా రామ్ భార్య బ్రహ్మి దేవీ(80) సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పోయిన ఆ పతకం కోసం తీవ్రంగా పోరాడి మళ్లీ సాధించుకున్నానని ఆమె స్పష్టం చేశారు. 'ఇప్పుడు ఆ పతకం తిరిగి నా చెంతకు రాబోతుంది. ఇక నేను మరణించినా ఫర్వాలేదు. ఆ పతకం నా భర్త చివరి జ్ఞాపకం. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పతకాన్ని వదులుకోను' అని బ్రహ్మిదేవీ స్పష్టం చేశారు.
అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించే వారికి జార్జ్ క్రాస్ పేరుతో పతకాలను అందించడం బ్రిటన్ దేశపు సాంప్రదాయం. దీనిలో భాగంగా ఆ పతకాన్ని భారతదేశానికి స్వాతంత్ర్యానికి పూర్వం 1946లో ఫీల్డ్ మార్షల్ లార్డ్ వేవెల్ జార్జ్ క్రాస్ పతకాన్ని నాయక్ కిర్పా రామ్ వీర మరణానికి చిహ్నంగా అతని భార్య బ్రహ్మిదేవీకి అందించారు. అయితే 13 సంవత్సరాల క్రితం ఆ పతకం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అపహరణకు గురైంది. దీంతో ఆ పతకం ఇప్పించాల్సిందిగా ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ను ఆశ్రయించింది.
బ్రిటిష్ హై కమిషన్ డిఫెన్స్ అటాచీ అయిన బ్రిగెడియర్ బ్రయాన్ మెక్ కాల్ ఈ పతకాన్ని మళ్లీ ఆమెకు ఓ చిన్న కార్యక్రమంలో అందించనున్నారు. 1945 సెప్టెంబర్ 12న బెంగళూరులో కిర్పారామ్ మరణించారు.