British authorities
-
లండన్‌లో మాయమైన కారు... పాకిస్తాన్లో ప్రత్యక్షం
లండన్: అది దాదాపు రూ.2.4 కోట్ల విలువైన ఖరీదైన బెంట్లీ కారు. దాన్ని బ్రిటన్‌లో మాయం చేసిన దొంగలు పాకిస్తాన్లో అమ్మేశారు. అయితే అధునాతన సాంకేతికత సాయంతో దాని జాడను బ్రిటన్ అధికారులు కనుగొన్నారు. మూడు లక్షల డాలర్ల విలాసవంత బెంట్లీ కారు కొన్ని వారాల క్రితం లండన్‌లో చోరీకి గురైంది. ఎట్టకేలకు దాని జాడను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాకిస్తాన్లో కనుగొంది. బ్రిటన్ అధికారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కరాచీ కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంపన్నులుండే డీహెచ్ఏ ప్రాంతంలో కారు దాచిన విషయం తెల్సుకున్నారు. ఓ ఖరీదైన భవంతి ప్రాంగణంలో చేసిన సోదాల్లో కారు దొరికింది. అయితే, పాకిస్తాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో యజమాని అది పాక్ వాహనమని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే, బ్రిటన్ అధికారులు ఇచ్చిన ఛాసిస్ నంబర్ వివరాలు ఈ కారుతో సరిపోలాయి. సరైన వాహన పత్రాలు ఇవ్వడంలో యజమాని విఫలమవడంతో కారును అధికారులు సీజ్ చేశారు. అతడిని, విక్రయించిన బ్రోకర్‌ను అరెస్ట్‌చేశారు. తూర్పు యూరప్‌లోని ఒక దౌత్యవేత్త పత్రాలను అడ్డుపెట్టుకుని కారును అక్రమంగా పాకిస్తాన్‌కు తరలించారని తేలింది. బెంట్లీ కారులోని ట్రేసింగ్ ట్రాకర్‌ను దొంగలు స్విఛ్ ఆఫ్ చేయడం మరిచిపోయారని, అందుకే అధునిక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా జాడ ఎక్కడుంతో ఇట్టే కనిపెట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖరీదైన వాహనాన్ని అక్రమంగా పాక్‌కు తీసుకురావడంతో ఆ దేశం 30 కోట్ల పాక్ రూపాయల పన్నును కోల్పోయింది. ఈ స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
ఇక నేను ప్రశాంతంగా చనిపోతా!
సిమ్లా: అతడో వీర సైనికుడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా పోరాడుతున్న సమయంలో సహచరుల ప్రాణాలు కాపాడే క్రమంలో తాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ సాహసానికి గాను బ్రిటిష్ సామ్రాజ్యం అతడికి మరణానంతరం జార్జి క్రాస్ పురస్కారం ఇచ్చింది. అయితే అది కాస్తా 2002 సంవత్సరంలో పోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పతకం అతడి భార్య చెంతకు వస్తోంది. దాంతో.. ఆమె ''ఇక నేను హాయిగా చచ్చిపోవచ్చు'' అంటూ నిట్టూరుస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యపు పురస్కారం జార్జ్ క్రాస్ పతకాన్ని తిరిగి పొందడంపై దివంగత భారతీయ సైనికుడు నాయక్ కిర్పా రామ్ భార్య బ్రహ్మి దేవీ(80) సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పోయిన ఆ పతకం కోసం తీవ్రంగా పోరాడి మళ్లీ సాధించుకున్నానని ఆమె స్పష్టం చేశారు. 'ఇప్పుడు ఆ పతకం తిరిగి నా చెంతకు రాబోతుంది. ఇక నేను మరణించినా ఫర్వాలేదు. ఆ పతకం నా భర్త చివరి జ్ఞాపకం. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పతకాన్ని వదులుకోను' అని బ్రహ్మిదేవీ స్పష్టం చేశారు. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించే వారికి జార్జ్ క్రాస్ పేరుతో పతకాలను అందించడం బ్రిటన్ దేశపు సాంప్రదాయం. దీనిలో భాగంగా ఆ పతకాన్ని భారతదేశానికి స్వాతంత్ర్యానికి పూర్వం 1946లో ఫీల్డ్ మార్షల్ లార్డ్ వేవెల్ జార్జ్ క్రాస్ పతకాన్ని నాయక్ కిర్పా రామ్ వీర మరణానికి చిహ్నంగా అతని భార్య బ్రహ్మిదేవీకి అందించారు. అయితే 13 సంవత్సరాల క్రితం ఆ పతకం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అపహరణకు గురైంది. దీంతో ఆ పతకం ఇప్పించాల్సిందిగా ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్‌ను ఆశ్రయించింది. బ్రిటిష్ హై కమిషన్ డిఫెన్స్ అటాచీ అయిన బ్రిగెడియర్ బ్రయాన్ మెక్ కాల్ ఈ పతకాన్ని మళ్లీ ఆమెకు ఓ చిన్న కార్యక్రమంలో అందించనున్నారు. 1945 సెప్టెంబర్ 12న బెంగళూరులో కిర్పారామ్ మరణించారు.