ప్రతీకాత్మక చిత్రం
ఒక్క రోజు కోసం ఎవరైనా పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? ఆ తర్వాత ఓ అందమైన నగరాన్ని ఆమెతో కలసి చుట్టేయాలనుకుంటున్నారా? మనది కాని ఊరిలో.. ఏ మాత్రం పరిచయం లేని ఓ అందమైన అమ్మాయితో ఒక్కరోజు వివాహం.. సాధ్యమే సుమా! అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోవడంతో మొదలై సిటీ అంతా ఎంచక్కా ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టేయొచ్చు. అందమైన సరసుల్లో విహారానికెళ్లొచ్చు. మధ్య మధ్యలో సెల్ఫీలకూ వీలుంటుంది. మీ స్తోమతను బట్టి ఈ పెళ్లికి మీ బంధుమిత్రులను కూడా ఆహాæ్వనించొచ్చు. అయితే ఈ పెళ్లి మీరు చేసుకోవాలనుకుంటే వేలం పాటలో పాల్గొనాల్సిందే. ఎంత ఖర్చయినా పర్లేదు ఒక్క రోజు పెళ్లి చాన్స్ కొట్టేయాలనుకుంటే బట్టలు సర్దుకోండి మరి.. కాస్త ఆగండి.. ఈ పెళ్లి తర్వాత ఉండే షరతులు కూడా చెబుతాం.. అప్పుడు ఓకే అనుకుంటే సర్దుకోండి బట్టలు.. ముఖ్యమైనదేంటంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని కనీసం ముద్దు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు.
అయితే చిన్నపాటి కౌగిలింతకు మాత్రం అవకాశం ఉంటుంది. అసలీ ఒక్క రోజు పెళ్లి ఏంటి..? చక్కర్లు కొట్టడం ఏంటి..? ఆ నిబంధనలేంటి అనుకుంటున్నారా? ఈ తంతు జరిగేది నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డాంలో. యువతను ఆకర్షించి అక్కడి పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు ఇలా ఓ వింత పెళ్లిని జరిపిస్తున్నారు. పర్యాటకులకు సాధారణ గైడ్ మాదిరిగా కాకుండా ఆత్మీయ స్నేహితురాలిగా మెలుగుతూ దగ్గరుండి ప్రాంతాన్ని ఆ వధువు చూపిస్తుందన్న మాట. ఇరువురి మధ్య గౌరవానికి భంగం రాకుండా ప్రవర్తించడం ఒక గొప్ప అనుభవంగా కూడా భావిస్తున్నారు. పర్యాటకులకు, ఆ ప్రాంతవాసులకు మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకూ ఈ ఆలోచన ఎంతగానో ఉపయోగపడుతోందట. దీని ద్వారా వచ్చే ఆదాయం లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విని యోగిస్తున్నారు. 2015 నుంచి ఈ వివాహాలను ‘వెడ్ అండ్ వాక్’పేరుతో నిర్వహిస్తున్నారు జోనా రెన్స్. ఆమ్‌స్టర్‌డాంలోని స్థానిక మార్కెటింగ్ సంస్థలు, వ్యాపారులు ‘అన్‌టూరిస్ట్ గైడ్ టు ఆమ్ స్టర్‌డాం’పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment