
ఒక ఊరు.. ఒక ఉరి..
ఒక ఊరు.. ఒక ఉరి..
1916, ఫిబ్రవరి నెల.. ఓ మధ్యాహ్నం వేళ..
చార్లీ స్పార్క్స్ సర్కస్ అమెరికాలోని కింగ్స్‌పోర్ట్‌కు వచ్చింది.. సర్కస్ మొదలైంది.. రకరకాల జంతువులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నాయి.. కానీ జనమంతా ఎవరి కోసమో ఎదురుచూస్తున్నారు.. అదిగదిగో మేరీ వచ్చింది.. ఒకటే చప్పట్లు.. ఈలలు.. మేరీ ఆ సర్కస్ స్టార్.. మేరీ ఓ ఏనుగు.. మేరీ డ్యాన్స్‌లేస్తుంది.. డ్రమ్స్ వాయిస్తుంది.. బేస్‌బాల్ ఆడుతుంది.. మేరీ అన్నీ చేస్తుంది. శాంతంగా ఉంటుంది.. అందుకే ఆమె అంటే అందరికీ ఇష్టం.. కానీ ఆ రోజు..
ఆ రోజు.. సర్కస్ ప్రచారం కోసం దాని యజమాని చార్లీ స్పార్క్స్ ఏనుగులతో వీధుల్లో పరేడ్ చేయించాలనుకున్నాడు. మేరీని నియంత్రించే పని వాల్టర్ ఎల్‌డ్రిడ్జ్‌కు అప్పగించాడు. అసలు వాల్టర్‌కు ఏనుగులను నియంత్రించడమే రాదు. అనుభవం లేదు. అతనికి అంకుశంతో హింసించడమెలాగో తెలుసు అంతే.. కింగ్స్‌పోర్ట్ వీధుల్లో పరేడ్ కొనసాగుతోంది.. మేరీ నడుస్తోంది.. అవసరమున్నా లేకున్నా.. వాల్టర్ అంకుశంతో ఆమెను పొడుస్తూనే ఉన్నాడు. ఇంతలో మేరీకి రోడ్డు పక్కన పుచ్చకాయ ముక్క కనిపించింది.
తొండంతో దాన్ని తీసుకోవాలనుకుంది. వాల్టర్‌కు మండింది. మేరీని ఎన్నాళ్ల నుంచో బాధిస్తున్న పుండుపై అంకుశంతో గట్టిగా పొడిచాడు. అంతే .. జరగరానిది జరిగిపోయింది. ఎప్పుడూ శాంతంగా ఉండే మేరీ రెచ్చిపోయింది. తొండంతో వాల్టర్‌ను తీసి.. నేలకేసి కొట్టింది. కాళ్లతో తొక్కింది.. మిగతా వారిని మాత్రం ఏం చేయలేదు. శాంతంగా అక్కడే అలా ఉండిపోయింది. జనంలో హాహాకారాలు. ఒకతను పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. మేరీకి చిన్నచిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి.
జనం.. దగ్గరదగ్గర 3 వేల మంది జనం. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నారు.. అదిగదిగో మేరీ వచ్చింది.. ఈసారి చప్పట్లు లేవు. చంపేయండి.. చంపేయండి అన్న అరుపులు తప్ప.. తప్పు ఎవరిది అని ఎవరూ ఆలోచించలేదు. కసి తీర్చుకోవాలి. మేరీని చంపాలి అంతే.. అయితే ఎలా చంపాలి? బులెట్ల ప్రభావం లేదు కనుక.. రెండు రైలు ఇంజిన్ల మధ్య మేరీని ఉంచి గుద్దించాలి అని అన్నారొకరు..
దాని కాలు ఒక ఇంజిన్‌కు, తల మరో ఇంజిన్‌కు తగిలించి.. రెండుగా చీల్చేయాలి అన్నారు మరొకరు.. కరెంట్ షాక్ ఇవ్వాలని ఇంకొకరు.. మేరీని చంపడానికి ఒప్పుకోకుంటే.. తన సర్కస్ మూతపడిపోతుందన్న భయంతో ఉన్న చార్లీ ఉరి తీస్తే ఎలా ఉంటుందన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. దగ్గర్లోని ఎర్విన్‌లోని రైల్వే యార్డ్ వద్దకు మేరీని తీసుకెళ్లారు. అక్కడ రైలు వ్యాగన్లను ఎత్తే 100 టన్నుల క్రేన్ సిద్ధంగా ఉంది. మేరీ తల చుట్టూ ఇనుప చైను వేశారు. పారిపోతుందన్న భయంతో కాలిని ఓ రైలు ఇంజిన్‌కు కట్టారు.
చంపేయండి.. చంపేయండి.. జనం మళ్లీ అరుపులు.. మేరీ ఎప్పట్లాగే శాంతంగా ఉంది. క్రేన్‌తో మేరీని 5 అడుగుల ఎత్తుకు లేపారు. పటపటమని ఎముకలు విరిగిన శబ్దం.. ఇంతలో చెయిన్ తెగిపోయింది.. మేరీ దడేలున కింద పడిపోయింది. శరీరంలోని ఎముకలన్నీ ఫటేల్. బాధతో మేరీ చేస్తున్న ఆర్తనాదాలు ఎవరి చెవులనూ తాకలేదు. బలమైన ఇనుప చెయిన్ తెచ్చారు. మళ్లీ కట్టారు. ఈసారి చాలా ఎత్తుకు లేపారు. మేరీ చనిపోయింది. ప్రపంచంలో ఓ ఏనుగును ఉరి తీసిన ఏకైక పట్టణంగా ఎర్విన్.. ఉరి తీయబడిన ఏకైక ఏనుగుగా మేరీ చరిత్రలో నిలిచిపోయారు. నాటి మనుషుల ఆటవిక న్యాయానికి గుర్తుగా.. మేరీ ఇప్పటికీ ఎర్విన్‌లోనే ఉంది.. అక్కడి భూమిపొరల్లో ఎక్కడో.. ఎప్పట్లాగే.. శాంతంగా నిద్రపోతోంది..